close

తాజా వార్తలు

Updated : 22/04/2021 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’

నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు

దిల్లీ: ‘‘మార్చి 30, 2021న కొవిడ్‌తో నా కళ్లముందే ఒక వ్యక్తి మరణించారు. 40ఏళ్లున్న ఆ వ్యక్తి బతుకుతాడనుకున్నా. కానీ, తెల్లారే ఆ వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఒక రెసిడెంట్‌ డాక్టర్‌గా విధుల్లో చేరిన నాకు అది తొలి అనుభవం. చాలా ఆవేదనకు గురయ్యా. 2020లో పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండేవంటూ అప్పుడు నా సీనియర్లు నాకు భరోసా ఇచ్చారు. కానీ, 2021 అంతకంటే దారుణంగా ఉంది. నిత్యం దాదాపు ఐదుగురు కరోనా బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తుంటే.. రోజుకు రెండుమూడు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి’’.. కరోనా రోగుల విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యురాలి ఆవేదన ఇది. దిల్లీలో రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న శాండ్రా సెబాస్టియన్ తనకు ఎదురైన అనుభవాలను హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే..

‘‘కొద్ది రోజుల క్రితం 22 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నప్పటికీ.. బతకడం కష్టమని మాకర్థమయింది. ‘బలమైన ఆహారం అందిస్తే బాగా కోలుకుంటాడా? దేవుడిని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి’ అంటూ ఆ యువకుడి తల్లిదండ్రులు కుమారుడిని బతికించుకోవడం కోసం ఆరాటపడతున్నారు. కానీ, నాలుగోరోజు.. అతడికి ఆయువు తీరింది. తనయుడి మరణవార్త విని, వారి గుండె పగిలిపోయింది. అప్పుడు మనసంతా ఏదో కెలికినట్లయింది. అప్పటి నుంచి రోగుల గురించి ఆప్తులకు అనవసరమైన ఆశలు కల్పించకుండా.. వాస్తవాలు చెప్పడం ఎలాగో నేర్చుకున్నాను. ‘నాకు నయమవుతుందా?’ అని రోగులు అడిగినప్పుడు వారికి అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నాను. చివరి దశలో అయినా వారు ప్రశాంతంగా ఉండాలనే చిన్నపాటి తాపత్రయమే అందుకు కారణం.’’

‘‘రెండు వారాల క్రితం మరో హృదయ విదారక ఘటన నా కళ్లముందు జరిగింది. ఆమె చివరి మాటలు హృదయాన్ని మెలిపెట్టాయి. ‘నాకు 11ఏళ్లు, నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. నేను వారికోసం బతకాలి’ అంటూ ఐసీయూలోకి వెళ్తూ ఓ తల్లి ఎంతగానో ఆరాటపడింది. ఆ కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచింది. ఆ ఇద్దరు పిల్లలకు తమ తల్లిని పట్టుకొని తనివితీరా ఏడ్చే అవకాశం కూడా లేకపోయింది. ‘మా అమ్మను ఒక్కసారి కౌగిలించుకుంటా’ అంటూ ఆ పిల్లలు ఏడుస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని చావులు చూస్తుంటే.. పుట్టకపోయినా బాగుండేది అనిపిస్తుంటుంది. మానసికంగా కుంగుబాటు కలుగుతోంది. నేను పనిచేస్తుండటం వల్ల ఒక్క ప్రాణమైనా కాపాడుతున్నాననే ఆశే నన్ను నడిపిస్తోంది. నాకు కరోనా సోకితే.. కేరళలో 50 ఏళ్ల వయసులో ఉన్న నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారనే ఆలోచన కూడా ఒక్కోసారి భయం పుట్టిస్తోంది. పరిస్థితులు చక్కబడతాయని వారికి నేను భరోసా ఇస్తున్నాను. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోమని మీ అందరిని కోరుతున్నాను. సరిగ్గా మాస్కు ధరించండి. ఇంట్లో ఉండటం ఒక అదృష్టం. దయచేసి అర్థం చేసుకోండి’’ అని ఆమె ఉద్విగ్నభరితంగా చెప్పుకొచ్చారు. కరోనా సృష్టిస్తోన్న కల్లోలానికి అడ్డుకట్ట వేసేందుకు..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.

కాగా ఈ కథనంపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. ‘హృదయం ద్రవించిపోతోంది. జాగ్రత్తగా ఉండండి’ అంటూ శాండ్రా స్టోరీని ట్విటర్‌లో షేర్ చేశారు. అలాగే ఇంట్లో ఉండండి, మాస్కు ధరించండంటూ హ్యాష్ ట్యాగ్‌లను జోడించారు.  
 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని