ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

తాజా వార్తలు

Updated : 07/02/2021 20:35 IST

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

మంచు చరియలు విరగడంతో ధౌలి గంగానది ఉగ్రరూపం
విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ధ్వంసం.. 150 మంది గల్లంతు!

చమోలీ: ఉత్తరాఖండ్‌లో మరోమారు జలప్రళయం సంభవించింది. చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగి పడడంతో గంగా నది ఉపనది అయిన ధౌలి గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీని ప్రభావంతో రేనీ- తపోవన్‌ వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా ధ్వంసమైంది. మరో మూడు వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పవర్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ) అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారంతా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.

చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ ప్రాంతంలో మంచుచరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ధౌలి గంగానది నీటి ప్రవాహం పెరిగింది. వరద ధాటికి తపోవన్‌- రేనీ ప్రాంతంలో ఉన్న రుషిగంగా పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా దెబ్బతింది. నీటి ప్రవాహం ధాటికి ప్రాజెక్ట్‌ సహా పలు ఇళ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు.

ధౌలి గంగా ఉప్పొంగిన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిసర గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పౌరీ, తెహ్రీ, రుద్ర ప్రయాగ్‌, హరిద్వార్‌, దేహ్రాదూన్‌ జిల్లాలో హైఅలెర్ట్‌ ‌ప్రకటించింది. అలాగే, వరదకు సంబంధించిన పాత వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి తప్పుడు ప్రచారం చేయొద్దని సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రజలకు సూచించారు. గంగా నది పరివాహక ప్రాంతానికి ఎవరూ వెళ్లొద్దన్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ బృందాలు రంగంలోకి దిగాయి.

పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: మోదీ

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అసోం పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌తో మాట్లాడారు. ఇతర ఉన్నతాధికారులతోనూ చర్చించిన ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర తరఫున అండగా ఉంటాం: అమిత్‌ షా

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. రాష్ట్ర సీఎంతో పాటు ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాల డీజీలతో మాట్లాడినట్లు తెలిపారు. అన్ని సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. దిల్లీ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేక దళాలు హెలికాప్టర్లలో బయలుదేరాయని తెలిపారు. అవసరమైతే మరింత మందిని పంపిస్తామన్నారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శితో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇవీ చదవండి...
కోఠిలో భారీ అగ్నిప్రమాదం

నావికాదళ సైనికుడి దారుణ హత్య!

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని