నిన్నెవ్వరూ కాల్చరు.. లొంగిపో!
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 15:18 IST

నిన్నెవ్వరూ కాల్చరు.. లొంగిపో!

ఉగ్రవాది లొంగిపోయిన భావోద్వేగ వీడియో

శ్రీనగర్: ఉడుకు రక్తం.. వయసుతో వచ్చిన ఆవేశం.. అర్థం లేని ఆకర్షణ.. గమ్యం లేని లక్ష్యం.. ఇవి ఓ యువకుణ్ని ఉగ్రవాదంలో చేరేలా చేశాయి. కానీ, తన తప్పును తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ముష్కరులు జరిపే రక్తపాతంలో ఇమడలేకపోయాడు. వారిలా కరడుగట్టలేదు. తన కోసం విలపిస్తున్న తండ్రిని చూసి కరిగిపోయాడు. ‘నీకేం కాదు మా వద్దకు రా’ అని పిలుస్తున్న జవాన్లు అతనికి సొంత సోదరుల్లా కనిపించారు. వీటన్నింటి ముందు తన వద్ద ఉన్న ఏకే-47 శక్తిమంతమైందేం కాదనిపించింది. వెంటనే దాన్ని పక్కన పడేశాడు. లొంగిపోయాడు. తండ్రితో కలిసి ఆనందంగా ఇంటికి పయనమయ్యాడు. ఈ భావోద్వేగ ఘటన జమ్మూ-కశ్మీర్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి. వివరాల్లోకి వెళితే.. 

ఈ నెల 13న ఓ స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్‌పీవో) రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండాపోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్‌ భట్‌ అనే యువకుడూ ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతడు జహంగీరే అని జవాన్లు గుర్తించారు. అతడి తండ్రిని ఎన్‌కౌంటర్ జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చారు. లొంగిపోవాలని ఆయనచేత చెప్పించారు. భయంతో వణుకుతూ తోటలో ఓ పొదల చాటున దాక్కున్న జహంగీర్‌కు తండ్రి మాట విని ప్రాణం లేచివచ్చింది. ‘దేవుడి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం నీకేం కాదు. నిన్నెవరూ కాల్చరు. వచ్చి లొంగిపో’ అని జవాన్‌ ఇచ్చిన హామీపై నమ్మకం కలిగింది. తుపాకీని పక్కనబెట్టి..చేతులు పైకెత్తి.. నెమ్మదిగా జవాన్ల వద్దకు చేరుకున్నాడు. 

అలా వచ్చిన అతనికి తాగడానికి నీళ్లిచ్చి సైనికులు ధైర్యం చెప్పారు. తప్పులు జరుగుతుంటాయి..నీకు ఏమీ కాదని భరోసా కల్పించారు. తన కొడుకును ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడినందుకు జహంగీర్‌ తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అతనికీ ధైర్యం చెప్పిన సైనికులు ఇంకెప్పుడు తన కొడుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని