Assam: పోలీసులను 10వేల మంది అడ్డుకొని దాడి చేశారు: సీఎం

తాజా వార్తలు

Published : 25/09/2021 01:22 IST

Assam: పోలీసులను 10వేల మంది అడ్డుకొని దాడి చేశారు: సీఎం

గువాహటి: ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన నివాసాలను తొలగించేందుకు అస్సాం అధికారులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ గురువారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దరాంగ్‌ జిల్లా ధోల్‌పుర్‌ గ్రామంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకోగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ శుక్రవారం స్పందించారు. 10వేల మందికి పైగా ప్రజలు పోలీసులను అడ్డుకొని వారిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

హిమాంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘భూమి లేనివారికి 2 ఎకరాలు ఇస్తామని అక్కడి ప్రజా ప్రతినిధులతో మాట్లాడాం. అందుకు వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే నివాసాలను ఖాళీ చేయించే ప్రక్రియను ప్రారంభించాం. ఎలాంటి ప్రతిఘటననూ ఆశించలేదు. కానీ దాదాపు 10వేల మంది ప్రజలు అస్సాం పోలీసులను అడ్డుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆ దాడిని ప్రతిఘటించారు’ అని సీఎం అన్నారు. పలు వీడియోలు చూపిస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్న వారికి సమాధానమిస్తూ ‘ఓ వీడియోను చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచలేరు. 1983 నుంచి ఆ ప్రాంతం హత్యలకు నిలయం. సాధారణంగా ప్రజలు దేవాలయ భూమిని ఆక్రమించరు. ఆ ఆక్రమణలను నేను పరిశీలించాను. శాంతియుతంగా వాటిని తొలగించే డ్రైవ్ ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. మరి ఈ దాడిని ఎవరు ప్రేరేపించారు? అని ప్రశ్నించారు.

ధోల్‌పుర్‌ గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో 800 కుటుంబాలు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు  అధికారులు తేల్చారు. వారిని అక్కడ నుంచి తరలించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే, తమకు సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని స్థానికులు నిరసన చేపట్టారు. తమకు అడ్డువచ్చిన పోలీసులపై కర్రలు, రాళ్లతో ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. దీంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఆందోళనకారులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని