
తాజా వార్తలు
‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
కోరిక వెల్లడించిన బ్రిటన్ నటుడు
ఇంటర్నెట్ డెస్క్: సమాజం పట్ల సేవాభావం ఉన్నవాళ్లు.. తాము చనిపోతే తమ శరీరంలోని అవయవాలను దానం చేయాలని లేదా మృతదేహాన్ని వైద్యకళాశాలలకు అప్పగించాలని కోరుకుంటారు. కానీ, ఓ నటుడు తాను చనిపోతే తన మృతదేహాన్ని జూలో ఉండే సింహాల ఆకలి తీర్చడానికి ఉపయోగించాలని కోరుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయంపై సింహాలకు ఫేమసైన లండన్ జూ స్పందించడం విశేషం.
బ్రిటన్‌కు చెందిన హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీస్ గతవారం ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వ్యాఖ్యాత మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు?అని ప్రశ్నించారు. వెంటనే రికీ స్పందిస్తూ.. తన మృతదేహాన్ని లండన్ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించాలని కోరాడు. తాను మరణించిన తర్వాత తన శరీరం కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని చెప్పాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యకు వివరణ ఇస్తూ ‘‘ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటున్నాం, అడవులను నరికేస్తున్నాం.. అన్నింటినీ నాశనం చేస్తున్నాం. కానీ, తిరిగి ఏమీ ఇవ్వట్లేదు. అందుకే సింహాలకు ఆహారంగానైనా ఉపయోగపడాలి’’అని అన్నారు. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లో భావాలను చూడాలని ఉందన్నాడు. రికీ ‘ఆఫ్టర్ లైఫ్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. గతేడాది ‘ఆఫ్టర్ లైఫ్ 2’ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
మృతదేహాలు అక్కర్లేదు.. విరాళాలు ఇవ్వండి: జూ
రికీ కోరికను లండన్ జూ తిరస్కరించింది. రికీని తినడానికి మా జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చు అని జూ నిర్వాహణాధికారి సరదాగా వ్యాఖ్యానించాడు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం జూ నిర్వహణ భారంగా మారిందని, ఎవరైనా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటే విరాళల రూపంలో ఇవ్వాలని కోరాడు. వచ్చే విరాళాలతో జూలోని సింహాలకు ఆహారం అందిస్తామని పేర్కొన్నాడు.