Afghan: ఏం జరిగినా భారత్‌పై నెట్టేయడమే..! 

తాజా వార్తలు

Updated : 19/07/2021 13:25 IST

Afghan: ఏం జరిగినా భారత్‌పై నెట్టేయడమే..! 

 ఇటీవల పాక్‌ తీరు


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మా ఇంట్లో  పొయ్యిపై కూర ఉడకలేదా..? భారతే కారణం.. మా ఇంటి కుళాయిలో నీళ్లు రాలేదా.. భారతే కారణం.. పాక్‌ వైఖరి అచ్చం ఇలానే ఉంటోంది. పాకిస్థాన్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి పొరుగు దేశాన్నే దోషిగా చూపించాలని భావిస్తోంది. వీటికి ఆధారాలు మాత్రం ఎప్పుడూ చూపించదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆ దేశంలో జరిగే కిడ్నాపులు కూడా భారత్‌ చేయిస్తోందని ఆరోపించే స్థాయికి చేరింది. తాజాగా పాకిస్థాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌  ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌లో ఇటీవల అఫ్గాన్‌ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్‌, దాడి వెనుక భారత్‌కు చెందిన రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ హస్తం ఉందని ఆరోపించారు. పాక్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు ఇదో పెద్ద అంతర్జాతీయ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..?

ఇటీవల పాక్‌లోని అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలీఖిల్‌ కుమార్తె సిల్సిలా అలీఖిల్‌ ఓ పనిపై రావల్పిండి నుంచి డమాన్‌-ఇ-కోహ వరకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యారు. ఆమెను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో అంతర్జాతీయ సమాజంలో పాక్‌ పరువు పోయింది. అఫ్గాన్‌ ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది.  వెంటనే పాక్‌లోని దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఆదివారం  ప్రకటించారు. దీంతో పాక్‌-అఫ్గాన్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ ఘటనపై పాక్‌ ఇంటీరియర్‌ మంత్రి షేక్‌ రషీద్‌ స్పందించారు.  దీని వెనుక పెద్ద అంతర్జాతీయ రాకెట్‌  ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రాకెట్‌కు భారత నిఘా సంస్థ ‘రా’ నేతృత్వం వహిస్తోందన్నారు. ఆయనకు ఆ అనుమానం రావడానికి గల బలమైన ఆధారం ఏమిటో మాత్రం వెల్లడించలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఒక సీసీ టీవీ ఫుటేజీ మిస్‌ అయ్యిందని  మాత్రమే చెప్పారు. అసలు కిడ్నాపే జరగలేదని పాక్‌ తాజాగా కొత్త వాదన తెరపైకి తెచ్చింది. దీనిపై అఫ్గాన్‌ ప్రభుత్వం మండిపడింది.  గతంలో ఇదే మంత్రిగారు పాక్‌ వద్ద పావుకిలో సైజులో అణుబాంబులు ఉన్నాయని.. అవి భారత్‌లో లక్ష్యంగా పెట్టుకొన్న వర్గాలను మాత్రమే చంపుతాయని ప్రేలాపనలు చేశారు.

పాక్‌లో దౌత్యవేత్తల కిడ్నాపులు జరగలేదా..?

గతేడాది జూన్‌లో ఇద్దరు భారతీయ దౌత్యాధికారులు కిడ్నాప్‌నకు గురైన ఘటనపై.. వెంటనే భారత్‌ జోక్యం చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వారిని కొద్ది గంటల అనంతరం విడుదల చేశారు. భారత అధికారులు ఓ వ్యక్తిని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించటంతో వారిని అరెస్టు చేశామని తర్వాత పాక్‌ పోలీసులు ప్రకటించారు. వారికి దౌత్యపరమైన రక్షణ ఉండటంతో అధికారులను భారత హై కమిషన్‌కు తిరిగి అప్పగించారు. సుమారు 12 గంటల పాటు నిర్బంధంలో ఉంచి వారిని చిత్ర హింసలు పెట్టారు.

పాక్‌లో భారీ ఎత్తున తాలిబన్‌ మద్దుతుదార్లు..

తాలిబన్లకు ఇప్పటికీ పాకిస్థాన్‌ సురక్షిత స్థావరంగా ఉంది. అఫ్గాన్‌ దళాలతో పోరాడేందుకు పాక్‌లో దాక్కొన్న వేల సంఖ్యలో తాలిబన్లు సరిహద్దులు దాటి వెళ్లారు. వీరితోపాటు పాక్‌ ఉగ్రసంస్థల సభ్యులు కూడా వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాక్‌లోని తాలిబన్‌ మూకలు అఫ్గాన్‌ రాయబారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మరోపక్క పాక్‌ సేనలు బహిరంగంగానే తాలిబన్లకు మద్దతు ప్రకటించాయి.

తప్పు చేశాక తప్పించుకొనే యత్నం..

‘‘పొరుగింటి వాళ్లని కాటేయాలని నువ్వు పామును పెంచితే.. అది నిన్ను కూడా కాటేయకుండా వదిలిపెట్టదు..’’ అని కొన్నేళ్ల క్రితం అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పాక్‌ను హెచ్చరించారు. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయి. అక్కడ పెరిగిన ఉగ్రవాదులే పాక్‌ పరువు తీస్తున్నారు. ఇటీవల పాక్‌లోని ఖైబర్‌ ఫక్తుంఖ్వాలో కొహిస్తాన్‌ పరిధిలోని డాసూ డ్యామ్‌ వద్ద ఒక బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది మృతి చెందారు. బస్సులోని సీఎన్‌జీ ట్యాంక్‌ ప్రమాదవశాత్తు పేలిందని తొలుత బుకాయించేందుకు కొహిస్తాన్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రయత్నించారు. కానీ, చైనా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొంది. ఈ బాంబు పేలుడుపై దర్యాప్తు చేపట్టాలని చైనా ప్రతినిధి ఝావో లిజియాన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో పాక్‌ తప్పని సరై దీనిని ఉగ్రదాడిగా అంగీకరించింది. ఆదివారం చైనా దర్యాప్తు బృందం పాక్‌కు వెళ్లి ఘటనా స్థలంలో చాలాసేపు ఉండి ఆధారాలు సేకరించింది.  ఒక వాహనంలో వచ్చి చేసిన ఆత్మాహుతి దాడిగా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌లోని చాలా ఉగ్రసంస్థలు చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఇటీవల చైనా హార్బర్‌ ఇంజినీరంగ్‌ కార్పొరేషన్‌ బహిరంగంగానే ప్రకటించింది. తెహ్రీకీ తాలిబన్‌, చైనా నుంచి పారిపోయి వచ్చిన వీగర్లు, బలోచ్‌ వేర్పాటు వాదులపై అనుమానాలు ఉన్నాయి. మిత్ర దేశమైన చైనా కళ్లకే గంతలు కట్టాలనుకున్న పాక్‌కు.. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న అఫ్గాన్‌ ఓ లెక్కా..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని