Afghanistans Ghost Soldiers: అఫ్గాన్‌లో ‘ఆత్మ’లను నమ్ముకున్న అమెరికా..!

తాజా వార్తలు

Updated : 22/08/2021 16:40 IST

Afghanistans Ghost Soldiers: అఫ్గాన్‌లో ‘ఆత్మ’లను నమ్ముకున్న అమెరికా..!

 పౌరప్రభుత్వ పతనానికి కారణమైన ఘోస్ట్‌ ఆర్మీ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రాజు గారు దేవతా వస్త్రం ధరించి వీధుల్లో ఊరేగితే పరాభవం జరిగినట్లే ఉంది అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి. అఫ్గాన్‌ ప్రభుత్వం వద్ద 3,00,000 మందికి పైగా సైన్యం ఉన్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పగటికలలు కంటూ వాటి శక్తిని అభివర్ణించి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. అఫ్గాన్‌ సైన్యంలో ఉన్న అవినీతి దళం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో..! దేశభద్రతను తాకట్టు పెట్టి మరీ అవినీతికి పాల్పడ్డారు.. వారు చేసిన అక్రమాల ఫలితం ఇప్పుడు అఫ్గాన్‌ సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు.

2016లోనే తెలుసు..

అఫ్గాన్‌ దళాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చెప్పినంత మంది లేనే లేరు. తాలిబన్ల ఆక్రమణ తర్వాతేమీ ఈ విషయం కొత్తగా వెలుగులోకి రాలేదు. గత కొన్నేళ్లుగా పత్రికలు, నివేదికలు ఈ అంశాన్ని ఘోషిస్తూనే ఉన్నాయి. 2016లో ‘ది గార్డియన్‌’పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. దీనిలో హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో దళాల జాబితాలో ఉన్న దాదాపు 40శాతం మంది వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేరని అఫ్గాన్‌ ప్రభుత్వానికి నివేదిక అందింది. కానీ, సరైన చర్యలు తీసుకోలేదు. తుపాన్‌ వజీరీ అనే రాజకీయ విశ్లేషకుడు అదే ఏడాది ప్రభుత్వ బృందంతో కలిసి హెల్మాండ్‌ ప్రావిన్స్‌కు వెళ్లాడు. అక్కడ ఒక బృందంలో 100 సైనికులు ఉన్నట్లు చెప్పినా.. వారిలో సగం మందిని ఆ కమాండర్‌ పై అధికారులకు ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండా పంపించేశాడు. వారి జీతాలను తన జేబులో వేసుకొంటున్నట్లు తేలింది.

అదే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీన ‘ది స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’ (సిగర్‌) నివేదిక ఈ అక్రమాల విషయాన్ని అమెరికా దృష్టికి తెచ్చింది. ‘‘అసలు అఫ్గాన్‌ ప్రభుత్వ సైనికులు, పోలీసులు ఎంత మంది ఉన్నారో కూడా అమెరికా సంకీర్ణ సేనలకు తెలియదు. వారిలో  ఎంత మంది విధులకు వస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో వారి సామర్థ్యాలు ఏమిటీ? అనే దానిపై అవగాహన లేదు’’అని పేర్కొంది.  సంగిన్‌ అనే బేస్‌లో 300 మంది సైనికులు ఉన్నట్లు లెక్కలు చూపినా.. కేవలం 15 మందే ఉన్నారు. చాలా సందర్భాల్లో అసలు ఎంతమంది అఫ్గాన్‌ సైనికులు గాయపడింది.. చనిపోయిందనే లెక్కలు కూడా వీరు సరిగ్గా చెప్పరు.

అవినీతి ఏ స్థాయికి చేరిందంటే సైనికులకు సరైన భోజనం కూడా లభించని పరిస్థితి నెలకొంది. మర్‌జహ్‌ అనే ప్రదేశంలో సైనికులే మెషిన్‌గన్లను తాలిబన్లకు అప్పగించి వారి నుంచి పిండి వంటి ఆహార పదార్థాలు తీసుకొన్నట్లు గుర్తించారు.

చాలా మంది పోలీసులు, సైనికులు మాదక ద్రవ్యాల అక్రమరవాణా దారులతో సంబంధాలు పెట్టుకోవడంతోపాటు.. వాటిని వినియోగించేవారు కూడా. సైనికులు మత్తులో జోగుతున్న విషయాన్ని పసిగట్టి తాలిబన్లు వారి బేస్‌లపై దాడులు చేసిన ఘటనలూ ఉన్నాయి.

అఫ్గాన్‌ పేపర్‌ ప్రాజెక్టు ఏం చెబుతోంది..

ది వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ‘అఫ్గానిస్థాన్‌ పేపర్స్‌’ పేరిట ప్రాజెక్ట్‌  చేపట్టింది. దీనిలో అఫ్గాన్‌ పోలీసులు, సైనికులు కలిపి లెక్కల్లో 3,52,000 మందిని చూపిస్తుండగా.. వాస్తవంగా ఆ సంఖ్య 2,54,000 మాత్రమే ఉన్నట్లు గుర్తించింది. అదనపు సైనికుల జీతం సొమ్మును కమాండర్లు తినేయడంతోపాటు.. విధుల్లో ఉన్న సైనికులకు కూడా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని పేర్కొంది.  ఖర్చుపెట్టడంలో ఉదారంగా వ్యవహరించిన అమెరికా ప్రభుత్వం అవినీతి అడ్డుకట్టకు మాత్రం చర్యలు తీసుకోలేదని కౌన్సిల్‌ ఆన్‌ ఫారెన్‌ రిలేషన్స్‌.ఓఆర్జీ తప్పుపట్టింది.

కుప్పకూలడానికి 15 రోజుల ముందు కూడా..

అఫ్గాన్‌ ప్రభుత్వం కుప్పకూలడానికి రెండు వారాల ముందు కూడా సిగర్ నివేదికలో మొత్తుకుంది. కాందహార్‌, జుబుల్‌,హెల్మాండ్‌,ఉర్జాన్‌ ప్రావిన్స్‌ల్లో లెక్కల్లో ఉన్న 50శాతం నుంచి 70శాతం వరకు సైనికులు అసలు లేరని పేర్కొంది. ఇన్నేళ్లు అఫ్గాన్‌ బలగాలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్న అమెరికా మాటలపై అనుమానం వ్యక్తం చేసింది. ఇక అఫ్గాన్‌ సైనికులకు శిక్షణ, ఆయుధాలు సమకూర్చే బాధ్యతల్లో సీఎస్‌టీఎస్‌-ఏ(కంబైన్డ్‌ సెక్యూరిటీ ట్రాన్సిషన్‌ కమాండ్‌-అఫ్గానిస్థాన్‌) పూర్తిగా విఫలమైందని పేర్కొంది.

లెక్కకు మూడు లక్షలు..

20ఏప్రిల్‌ 2021 లెక్క ప్రకారం రక్షణ శాఖ కింద 1,82,071 మంది ఉండగా.. ఇంటీరియర్‌ మినిస్ట్రీ కింద 1,18,628 మంది ఉన్నారు. వీరంతా బయోమెట్రిక్‌ విధానంలో నమోదై ఉన్నారు. వీరికి అదనంగా.. వివిధ పనుల నిమిత్తం ఇంకొంత మందిని విధుల్లోకి తీసుకొన్నారు. మే-జులై మధ్యలో తాలిబన్లు స్వాధీనం చేసుకొన్న రాష్ట్రాల్లో చనిపోయిన వారు, గాయపడినవారు, లొంగిపోయినవారు, దొరికిపోయినవారు, ఇతర దేశాలకు పారిపోయిన వారిని కలిపి చూసుకొంటే వాస్తవంగా అక్కడ ఉండాల్సిన సంఖ్యకు ఏమాత్రం పోలడంలేదు.

రెండు నెలల్లో 26 వెన్నుపోట్లు..

ఏప్రిల్‌ 2021 నుంచి 30 జూన్‌ 2021 వరకు 26 సార్లు అఫ్గాన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ ఫోర్సుల్లోని సభ్యులే తమ వారిపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 81 మంది సైనికులు మరణించగా.. 37 మంది గాయపడ్డారు.

పునాదులు కూడా బలహీనమే..

ఘోస్ట్‌ ఆర్మీ పోను మిగిలిన సైనికుల శిక్షణ వ్యూహంలో కూడా అమెరికా తప్పు చేసింది. తమ సైనికుల వలే అఫ్గాన్‌ సైనికులు వాయుసేన, టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడేట్లు శిక్షణ ఇచ్చింది. ఫలితంగా అమెరికా వైదొలిగాక అఫ్గాన్‌ దళాలకు వాయుసేన మద్దతు కరవైంది. ఇక అఫ్గాన్‌ వద్ద అత్యాధునిక విమానాలు లేవు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాలు ఉన్నాయి. అదే సమయంలో పాక్‌ రంగంలోకి దిగి అఫ్గాన్‌ దళాలు వైమానిక దాడులు చేస్తే ఊరుకోమంటూ బెదిరించింది. దీంతో వారు తాలిబన్ల దాడులకు ఏమాత్రం ఎదురొడ్డి నిలవలేకపోయారు. కొన్ని చోట్ల పరిస్థితి ముందే ఊహించి లొంగిపోయారు. అమెరికా వాస్తవం గ్రహించి వైమానిక దాడులు చేపట్టినా.. అప్పటికే అఫ్గాన్‌ దళాల నైతికస్థైర్యం దెబ్బతింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని