
తాజా వార్తలు
‘ఆందోళనకారులకు ప్రవేశం లేదు’
దిల్లీ సరిహద్దుల్లో పోస్టర్లు అంటించిన పోలీసులు
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు
దిల్లీ: దేశరాజధాని సరిహద్దుల్లోని ఆందోళనకారులు వెంటనే ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ పోలీసులు మంగళవారం పోస్టర్లు అంటించారు. దీనిపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాల ప్రకారం.. మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతాల్లో ఒకటైన టిక్రీ సరిహద్దుల్లోని రైతులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని దిల్లీ పోలీసులు పోస్టర్లు అంటించారు. దీనిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇది పాత విషయమేనని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులకు దిల్లీలోకి ప్రవేశం లేదని తాము తెలుపుతున్నామన్నారు.
ఈ అంశంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ సుమారు గత మూడు నెలలుగా మా హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ రోజు టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు పోస్టర్లు అంటించి బెదిరిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వారు అడ్డుకొంటున్నారు. ఇటువంటి బెదిరింపులతో మా ఉద్యమాన్ని ఆపలేరు.’’ అని ఎస్కేఎం ఆ ప్రకటనలో పేర్కొంది.
పోస్టర్లు అంటించడంపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. ఇదొక సాధారణ ప్రక్రియ అన్నారు. ‘‘ సరిహద్దుల్లో అంటించిన పోస్టర్లు నిరసన ప్రారంభమైన తర్వాత అంటించారు. ఇదొక సాధారణ ప్రక్రియ. వారు ప్రస్తుతం హరియాణా పరిధిలో ఉన్నారు. వారు చట్టవిరుద్ధంగా దేశరాజధానిలోకి ప్రవేశించరాదని పోలీసులు పోస్టర్ల ద్వారా తెలిపారు.’’ అని ఆయన వెల్లడించారు.