
తాజా వార్తలు
టీకా తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్!
దిల్లీ: ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి అంతం భారత్‌లో ఆరంభమైంది. యావత్తు వ్యవస్థని ఛిన్నాభిన్నం చేసిన కరోనా కోరల్ని తుంచేసే మహాక్రతువు ప్రారంభమైంది. విచ్చలవిడిగా విస్తరించిన వికృత రూపానికి ఇక సంకెళ్లు పడనున్నాయి. కరోనా చేసిన కరాళనృత్యానికి టీకా ఆయుధంతో ముగింపు పడనుంది.
దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సమక్షంలో తొలి టీకా వేశారు. కరోనాపై పోరులో ముందున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరైన మనీష్ కుమార్‌కు తొలి టీకా ఇచ్చారు. అనంతరం హర్షవర్ధన్ అక్కడే ఉండగా.. రణ్‌దీప్ గులేరియా సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ప్రకారం.. వరుసగా ఇతర పారిశుద్ధ్య కార్మికులకు టీకా వేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. ఇలాంటి బృహత్తర కార్యక్రమాల్ని సమర్థంగా నిర్వహించడంలో భారత్‌కు చక్కని అనుభవం ఉందన్నారు. పోలియో, స్మాల్‌పాక్స్ వంటి మహమ్మారుల్ని అంతం చేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పర్యవేక్షణలో అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఒడిశాలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, ఎస్వోఏ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అశోక్ మోహపాత్రా భువనేశ్వర్‌లోని ఎస్యూఎం ఆస్పత్రిలో టీకా తొలి డోసు తీసుకున్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. దేశ శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. రెండో డోసు తీసుకోవడం మర్చిపోవద్దని సూచించారు. ఇక దేశవ్యాప్తంగా ఈరోజు మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని 3,006 కేంద్రాల్లో పంపిణీ ప్రారంభమైంది. ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది?.. ఇంకా ఎన్ని డోసులు అవసరం.. తదితర అంశాలను కొవిన్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకోనున్నారు. టీకాల పంపిణీపై తలెత్తే సందేహాల నివృత్తికి 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..
అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం