అర్హులందరికీ ఉచిత టీకా: మోదీ

తాజా వార్తలు

Updated : 25/04/2021 13:48 IST

అర్హులందరికీ ఉచిత టీకా: మోదీ

దిల్లీ: తొలి దశ కరోనా విజృంభణను సమర్థంగా ఎదుర్కొన్న భారత్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సమయంలో తుపాన్‌లా వచ్చిపడ్డ రెండో దశ యావత్తు దేశాలన్ని అతలాకుతలం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే నిపుణులు, శాస్త్రవిజ్ఞాన రంగం అందిస్తున్న సలహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కష్టసమయంలో రాష్ట్రాలకు కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కరోనా వ్యాక్సిన్లపై వస్తున్న అన్ని రకాల వదంతుల్ని మోదీ ఈ సందర్భంగా కొట్టిపారేశారు. అర్హులందరికీ కేంద్రమే ఉచితంగా టీకా అందజేస్తుందని హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కరోనా కట్టడి చేయడమే లక్ష్యంగా వివిధ వర్గాలతో చర్చించినట్లు పేర్కొన్నారు. అన్ని రంగాల వారు ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలిచ్చారన్నారు.

కరోనాపై పోరులో తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పలువురు వైద్యులు, నర్సులు, అంబులెన్సు డ్రైవర్ల కృషిని కొనియాడారు. వారిలో కొంతమందితో ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనాపై ఎటువంటి సమాచారం కావాలన్నా.. కుటుంబ వైద్యులు లేదా స్థానికంగా ఉండే డాక్టర్ల నుంచి మాత్రమే తీసుకోవాలని సూచించారు. అనేక మంది వైద్యులు ఈ విషయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. వారి క్లినిక్‌లు, సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లు, ఫోన్‌ ఇలా పలు మార్గాల ద్వారా ఉచిత సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు.

వైద్యారోగ్య సిబ్బందితో పాటు కొంతమంది స్వచ్ఛందంగానూ కొవిడ్‌ బాధితులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని మోదీ తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులకు అనేక మంది పండ్లు, కూరగాయలు, ఔషధాలు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారన్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు సైతం తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయన్నారు.

గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మోదీ తెలిపారు. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ.. గ్రామాల్ని కరోనా నుంచి కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చే వ్యక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. ఈ సారి మొత్తం మన్‌ కీ బాత్‌లో కరోనాపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నెలకొన్న దయనీయ పరిస్థితులే అందుకు కారణమన్నారు.

దవాయి భీ.. కడాయి భీ(ఔషధమూ తీసుకోవాలి.. జాగ్రత్తలూ పాటించాలి) అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. అప్పుడే ఈ సంక్షోభం నుంచి అందరమూ బయటకొస్తామన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని