Pegasus: ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు అమెజాన్‌ వెబ్‌ సేవలు నిలిపివేత..!

తాజా వార్తలు

Published : 21/07/2021 01:12 IST

Pegasus: ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు అమెజాన్‌ వెబ్‌ సేవలు నిలిపివేత..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పెగాసస్‌ సైబర్‌ ఆయుధ రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ షాక్‌ ఇచ్చింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు 50 వేల ఫోన్లను హ్యాక్‌ చేయడానికి దీనిని వినియోగించినట్లు బయటపడటం సంచలనం సృష్టించింది. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌కు అమెజాన్‌ వెబ్‌ సర్వీసు అందిస్తున్న మౌలిక వసతులు, ఖతాలకు సేవలను నిలిపివేసింది. మదర్‌బోర్డ్‌ అనే పత్రికకు అమెజాన్‌ వెబ్‌సర్వీసు ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘‘మాకు ఈ కార్యకలాపాల గురించి తెలిసిన వెంటనే స్పందించాము. ఆ సంస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖాతాలను మూసివేశాము’’ అని అమెజాన్‌ ప్రతినిధి ఈ మెయిల్‌లో మదర్‌బోర్డ్‌కు తెలిపారు. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ఇటీవలే అమెజాన్‌ వెబ్‌ సర్వీసులోని క్లౌడ్‌ ఫ్రంట్‌ సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఇది కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్కింగ్‌ సేవలను అందిస్తుంది. కస్టమర్లతో నెట్‌వర్కింగ్‌ సంబధాలను నిర్వహించడానికి దీనిని వినియోగిస్తారు. ఎన్‌ఎస్‌వో వేగంగా తమ మాల్వేర్‌ను లక్ష్యాలకు చేర్చేందుకు దీనిని వినియోగిస్తోంది. వాస్తవానికి అమెజాన్‌ క్లౌడ్‌ ఫ్రంట్‌ చాలా వేగంగా వీడియోలు, ఫొటోలు,డేటాను ప్రసారం చేయగలదు. దీనిలో లేటెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. ఎన్‌ఎస్‌వో ఇంటర్నెట్‌ స్కానింగ్‌ టెక్నిక్స్‌ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 

గతేడాది మేలో కూడా ఎన్‌ఎస్‌వో మాల్వేర్‌పై వివాదం చెలరేగింది. అప్పట్లో తమ సేవలను ఎన్‌ఎస్‌వో వాడుకోవడంపై అమెజాన్‌ మౌనం వహించింది. ఈ సారి మాత్రం స్పందించి వెంటనే సేవలను నిలిపివేసింది. పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 వేలకు పైగా ఫోన్‌ నంబర్లను ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో వెయ్యికి పైగా నంబర్లు 50 దేశాల్లోని వ్యక్తులవని ఇప్పటివరకు తేలింది. బాధితులుగా నిర్ధారణ అయినవారిలో పాత్రికేయులు,  రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు,  మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వాధినేతలు ఉన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని