9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

తాజా వార్తలు

Published : 24/02/2021 16:40 IST

9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్రం ప్రత్యేక చర్యలు

దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్రం బుధవారం ఉన్నతస్థాయి బృందాలను పంపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ బృందాలను మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు పంపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాల కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్య నిపుణులు, అధికారులతో చర్చించి వైరస్‌ వ్యాప్తి గొలుసును తెంచేందుకు ప్రయత్నిస్తారన్నారు. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా టెస్టులు తగ్గించినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలున్నా రాపిడ్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆయన ఆదేశించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, కేరళల నుంచే వస్తున్నాయని ఆయన తెలిపారు. కరోనా జన్యుమార్పిడి చెందుతూ ప్రమాదకరంగా మారుతుండటంతో ప్రభుత్వాలు అలసత్వం వహించరాదని ఆయన ఆదేశించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా కేసులు పెరగడంపై నివేదికలు అందించాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని