
తాజా వార్తలు
‘చట్టాలు రద్దు చేసి నా చివరి కోరిక తీర్చండి’
టిక్రి సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతు ఉద్యమానికి కేంద్రమైన టిక్రి సరిహద్దుకు కొద్ది దూరంలోనే ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అతడి వద్ద ఓ లేఖ కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు.
హరియాణాలోని హిసార్ జిల్లాకు చెందిన రజ్బీర్ (49) కొన్నాళ్లుగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొందరు రైతులు తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి రావడానికి నూతన వ్యవసాయ చట్టాలే కారణమని రజ్బీర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తన చివరి కోరికను తీర్చాలని అందులో కేంద్రాన్ని కోరడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
గత నెలలోని హరియాణాలోని జింద్‌కు చెందిన ఓ రైతు సైతం ఇలానే ఉరివేసుకున్నాడు. అంతకు ముందు హరియాణాకు చెందిన మరో రైతు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డడాడు. గతేడాది డిసెంబర్లో పంజాబ్‌కు చెందిన ఓ లాయర్, సిక్కు మత గురువురు సంత్ రామ్‌సింగ్ సైతం రైతు ఉద్యమం కోసం బలవన్మరణానికి పాల్పడ్డారు.