తొలిదశ పోలింగ్‌కు సిద్ధమైన బెంగాల్‌, అసోం!

తాజా వార్తలు

Updated : 27/03/2021 09:26 IST

తొలిదశ పోలింగ్‌కు సిద్ధమైన బెంగాల్‌, అసోం!

పశ్చిమ బెంగాల్‌లో 30, అసోంలో 47 స్థానాల్లో పోలింగ్‌

దిల్లీ: ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గం.ల వరకు అక్కడ పోలింగ్‌ జరగనుంది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలుండగా, ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశలో శనివారం (మార్చి 27) 47 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రానికి తెరపడింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.88కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అసోంలో మొత్తం 2కోట్ల 33లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. వీరికోసం మొదటి దశలో 11,537 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మొత్తం 50శాతం పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తొలి దశలో భాగంగా మొత్తం 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పోలింగ్‌ సమయంలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఎన్నికల అధికారులు స్పష్టంచేశారు.

పశ్చిమ బెంగాల్‌లోనూ..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.32కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఎనిమిది దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా వేయి పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటిదశ కింద శనివారం 30అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురులియా, బంకురా, ఝార్‌గ్రాం, తూర్పు మేదినీపుర్‌తోపాటు పశ్చిమ మేదినీపుర్‌ (మొత్తం ఐదు) జిల్లాల్లో శనివారం పోలింగ్‌ జరగనుంది.

తొలిదశ ఎన్నికలు జరుగుతోన్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో భాజపా అగ్రనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు ప్రచారం నిర్వహించగా, అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా భారీ స్థాయిలో ప్రచారం చేశాయి. బెంగాల్‌లో మొదటిదశ ఎన్నికలు జరుగనున్న 30 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించి ప్రచారం నిర్వహించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని