Narendra Modi: ఆగస్టు 5.. చరిత్రలో నిలిచిపోయే రోజు: మోదీ

తాజా వార్తలు

Updated : 05/08/2021 21:44 IST

Narendra Modi: ఆగస్టు 5.. చరిత్రలో నిలిచిపోయే రోజు: మోదీ

దిల్లీ: ఆగస్టు 5ను దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే రోజున.. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న అధికరణం 370 రద్దు, గతేడాది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం (PMGKP) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించి 41ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రోజు కూడా ఇదే కావడాన్ని మోదీ విశేషంగా చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనను ఆయన కొనియాడారు. ఒలింపిక్స్‌ పతకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి సరికొత్త గుర్తింపు లభిస్తోందన్నారు. భారత యువత ముందుకు సాగిపోతోందని, దేశం పురోగతి సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు.

పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుపై మోదీ మండిపడ్డారు. దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సమయంలో, దిల్లీలో కొంతమంది పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అయితే వారి స్వార్థపూరిత రాజకీయాలతో దేశ పురోగతిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్‌ను రాజకీయ కోణంలోనే చూస్తున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తున్న అంశాన్ని గత పాలకులు విస్మరించారని వెల్లడించారు. అయితే కొన్నేళ్లుగా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని ఉద్ఘాటించారు. వచ్చే దీపావళి వరకు పేదలకు ఉచిత రేషన్‌ సదుపాయం కొనసాగుతుందని మోదీ తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై వదంతులను విశ్వసించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు మరింత మందిని ప్రోత్సహించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని