ఫాస్టాగ్‌ ద్వారా నిత్యం రూ.100 కోట్ల వసూళ్లు!

తాజా వార్తలు

Updated : 22/03/2021 21:53 IST

ఫాస్టాగ్‌ ద్వారా నిత్యం రూ.100 కోట్ల వసూళ్లు!

వెల్లడించిన కేంద్ర రవాణా శాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌గేట్ల నుంచి వసూలు చేస్తోన్న రుసుము రోజువారీగా సరాసరి రూ.100కోట్ల మార్కును దాటింది. ఫాస్టాగ్‌ ద్వారా చేస్తోన్న చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘మార్చి 16 నాటికి 3 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాము. వీటి ద్వారా మార్చి ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు నిత్యం సరాసరి వంద కోట్ల రూపాయలు వసూలు అవుతోంది’ అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం లేకుండా, సులువుగా రుసుము చెల్లింపులు చేసేందుకు డిజిటల్‌ పద్ధతి ఎంతో దోహదం చేస్తోందని, దీంతో వాహనాలు వేచివుండే సమయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు టోల్‌ చెల్లింపుల్లో పారదర్శకత పెరిగేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

ఇక, ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మధ్యే వెల్లడించారు. వీటి స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. జీపీఎప్‌ ఆధారంగా..వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుసువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశంలోని అన్ని టోల్‌గేట్‌ల వద్ద ఫాస్టాగ్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి రెట్టింపు రుసుమును వసూలు చేస్తున్నారు.

రైతుల ఆందోళన.. ₹814 కోట్ల నష్టం

రైతుల ఆందోళన కారణంగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.814.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో టోల్‌ప్లాజాల వద్ద చెల్లింపులు నిలిచిపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని చెప్పారు. పంజాబ్‌లో రూ.487 కోట్లు, హరియాణాలో రూ.326 కోట్లు, రాజస్థాన్‌లో రూ.1.40 కోట్లు చొప్పున నష్టం వాటిల్లిందని, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నష్టమూ జరగలేదని చెప్పారు. టోల్‌ చెల్లింపులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారులకు సూచించామని గడ్కరీ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని