
తాజా వార్తలు
రెండు నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్
ప్రైవేటు భాగస్వామ్యంతో సాధ్యమన్న అజిమ్ప్రేమ్జీ
బెంగళూరు: ప్రస్తుతం దేశంలో పెద్దఎత్తున జరుగుతున్న వ్యాక్సిన్ పంపిణీ ప్రైవేటు భాగస్వామ్యంతో వేగవంతమవుతుందని విప్రో మాజీ ఛైర్మన్ అజిమ్ ప్రేమ్జీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ సమావేశంలో సూచించారు. ప్రైవేటు సంస్థలను ఇందులో భాగం చేయడం ద్వారా రెండు నెలల్లో సుమారు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించొచ్చని ఆయన అన్నారు.
‘‘ వ్యాక్సిన్లను తక్కువ సమయంలో తయారు చేసిన భారత్ వాటిని పెద్ద మొత్తంలో పంపిణీ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అధిగమించొచ్చు. వ్యాక్సిన్ పంపిణీలో కార్యక్రమంలో ప్రైవేటు సంస్థలను చేర్చుకుంటే, 60 రోజుల్లో 500 మిలియన్ల మందికి వ్యాక్సిన్లు అందించగలం. సీరం సంస్థ మూడు వందలకు ఒక వ్యాక్సిన్ అందిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యాక్సిన్ ధర రూ. 400లకు చేరుతుంది. ఆ ఖర్చు ఎక్కువ మంది ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉంటుంది.’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు అభినందనీయమన్న ఆయన ఇతర మార్గాలను కూడా యోచించాలని సూచించారు. కరోనాపై పోరాడేందుకు గతేడాదిలో విప్రో సంస్థ సుమారు రూ.1125 కోట్ల నిధులు అందించనున్నట్లు ప్రకటించింది.