close

తాజా వార్తలు

Published : 19/01/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మురికి కుంట.. బారాన్‌కు సిరుల పంట

 వ్యర్థ జలాలు శుద్ధి చేసి సాగు అవసరాలకు..

 ఓ పంజాబీ గ్రామ విజయగాథను పంచుకున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ 

దిల్లీ: మురుగు నీటి దుర్గంధం నుంచి విముక్తి పొందిన ఓ పంజాబీ గ్రామ విజయగాథ ఇది. పటియాలా జిల్లాలోని 3,322 మంది జనాభా ఉన్న బారాన్‌ గ్రామం రోజువారీగా ఇళ్ల నుంచి వెలువడే మురికి నీటిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శుద్ధి చేసుకొని వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న తీరును కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మురుగు స్థిరీకరణ కుంట (వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్‌) ఏర్పాటు చేసుకొని ఆ పల్లెలోని 553 ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీటిని స్థానిక ప్రజలు సాగుకు వినియోగించుకుంటున్నారు.

అయిదంచెల వ్యవస్థ..

చారిత్రక గురుద్వారా సాహిబ్‌కు సమీపంలో ఉన్న కుంట గ్రామంలోంచి వెలువడే వ్యర్థ జలాలతో నిండిపోయి మురికిగా తయారైంది. క్రమంగా అందులో పూడిక చేరి వీధుల్లోకి మురుగు ప్రవహించి అపరిశుభ్రతను పెంచింది. దీంతో గ్రామ సర్పంచ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం చూపాలని వేడుకున్నారు. అందుకు ఆ శాఖ థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిన వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్‌ విధానాన్ని అనుసరించాలని సూచించింది. అందులో భాగంగా గ్రామస్థులు అయిదంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

1.స్క్రీనింగ్‌ చాంబర్‌ కింద గ్రామంలోని ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని సేకరించి, అందులో తేలియాడే వస్తువులను వేరు చేశారు. 

2. డైజెషన్‌ వెల్‌ ద్వారా నీటిని కలియ తిప్పి ఘన వ్యర్థాలు అడుగుకు, ద్రవ వ్యర్థాలు పైకి వచ్చేలా చేశారు. 

3. స్కిమ్మింగ్‌ ట్యాంక్‌ ద్వారా నీటిని చిలికి నీటిలో కలిసిన ద్రవాలను వేరు చేశారు. 

4. స్టెబిలైజేషన్‌ ట్యాంక్‌ ద్వారా దాదాపు శుభ్ర పరిచిన నీటిని సేకరించారు. 

5. నాలుగుదశలు పూర్తి చేసుకొని శుభ్రమైన నీటిని ఆక్సిడేషన్‌ పాండ్‌లోకి పంపి సూర్యరశ్మి, బ్యాక్టీరియా, శిలీంద్రాల ద్వారా శుభ్ర పరిచి ఆ నీటిని ఓ చెరువులోకి వదిలి వ్యవసాయ అవసరాలకు వాడుకొనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

రూ.39.86 లక్షల ఖర్చుతో..

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలను కలగలిపి రూ.39.86 లక్షల ఖర్చుతో ఈ ప్రాజెక్టును తయారు చేశారు. మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తోంది. ఈ శుద్ధి వ్యవస్థ ద్వారా గ్రామం పరిశుభ్రంగా తయారైంది. 

ఇవీ చదవండి..
ట్రంప్‌ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్‌ కుదరదన్నారు!

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని