జర్నలిస్టు మీదకు యుద్ధ విమానాన్ని పంపి..

తాజా వార్తలు

Published : 24/05/2021 12:50 IST

జర్నలిస్టు మీదకు యుద్ధ విమానాన్ని పంపి..

బెలారస్‌: అతడో విలేకరి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల గురించి రాసి పాలకుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో దేశం విడిచి పారిపోయాడు. కానీ ఆ ప్రభుత్వం ఊరుకోలేదు.. అతడు విమానంలో వెళుతున్నాడని తెలుసుకుని దానిపైకి యుద్ధవిమానాన్ని పంపింది. అతడు ప్రయాణిస్తున్న విమానాన్ని బలవంతంగా తమ దేశానికి దారిమళ్లించి మరీ అతడిని అరెస్టు చేసింది. ఓ విమర్శకుడి అరెస్టు కోసం బెలారస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బెలారస్‌లో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో అక్రమంగా గెలిచారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.  ఆనాటి అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆందోళనలపై కన్నెర్ర చేసిన అధ్యక్షుడు లుకాషెంకో.. దాని వెనుక కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల హస్తం ఉందంటూ వారి అరెస్టులకు పూనుకున్నారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అక్కడి అధికారులు వారిపై అక్రమంగా కేసులు బనాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన 26 ఏళ్ల జర్నలిస్టు రోమన్‌ ప్రొటాసెవిచ్‌, మరికొందరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన పోలాండ్‌లో తలదాచుకుంటున్నాడు. 

అయితే ఆదివారం రోమన్‌ ప్రొటాసెవిచ్‌.. ఏథెన్స్‌ నుంచి విల్నియస్‌కు ర్యాన్‌ఎయిర్‌ విమానంలో వెళ్లనున్నాడని బెలారస్‌ ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఆ విమానంపైకి బెలారస్‌ యుద్ధ విమానాన్ని పంపింది. ర్యాన్‌ఎయిర్‌ విమానంలో బాంబు ఉందని తమకు సమాచారం వచ్చినట్లు చెప్పి, ఆ విమానాన్ని బలవంతంగా దారిమళ్లించి బెలారస్‌ రాజధాని మింక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించింది. ఆ తర్వాత రోమన్‌ను అదుపులోకి తీసుకుంది. తీరికగా సోదా తతంగం నడిపి, బాంబు ఏమీ లేదని నిర్ధారించి.. విమానాన్ని పంపించేసింది.

విమానాన్ని బెలారస్‌ మళ్లిస్తున్నామని సిబ్బంది ప్రకటించగా.. సీట్లో కూర్చున్న రోమన్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. ఆ దేశంలో తాను మరణశిక్ష ఎదుర్కొంటున్నానని చెబుతూ చాలా భయపడ్డాడని తోటి ప్రయాణికులు తెలిపారు. ఆ విమానంపైకి యుద్ధ విమానాన్ని పంపి దారిమళ్లించాలని అధ్యక్షుడు లుకాషెంకోనే ఆదేశించినట్లు బెలారస్‌ ప్రభుత్వం తమ టెలిగ్రామ్‌ ఛానెల్‌లో ప్రకటించడం గమనార్హం.

ఆగ్రహించిన అంతర్జాతీయ సమాజం..

ఈ ఘటనను అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. 120 మంది ప్రయాణికులను ప్రమాదంలో పెట్టి, బెలారస్‌ అధ్యక్షుడు ప్రవర్తించిన తీరు దిగ్భ్రాంతికరమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హైజాకింగ్‌, ఉగ్రవాద చర్యే అని పొలాండ్‌ ప్రధాని మండిపడ్డారు. లిథుయేనియా సహా కొన్ని దేశాలు బెలారస్‌ గగనతలాన్ని నిషేధించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని