West Bengal:ఆలాపన్‌కు కేంద్రం షోకాజ్‌ నోటీసులు‌!

తాజా వార్తలు

Published : 01/06/2021 14:06 IST

West Bengal:ఆలాపన్‌కు కేంద్రం షోకాజ్‌ నోటీసులు‌!

దిల్లీ: పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య చెలరేగిన తాజా వివాదంలో ప్రస్తుతం కేంద్ర బిందువుగా మారిన ఆ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బంధోపాధ్యాయ్‌కి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ‘యస్‌’ తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి గైర్హాజరైనందుకు కారణాలు తెలపాలని కోరింది. విపత్తు నిర్వహణ చట్టం అధికారాల కింద ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.  

ఆలాపన్‌ బంధోపాధ్యాయ్‌ విషయంలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పదవీ విరమణ చేసి, సేవల పొడిగింపులో భాగంగా మంగళవారం ఉదయం దిల్లీకి డిప్యుటేషన్‌పై రావాల్సిందిగా ఆయన్ని కేంద్రం ఆదేశించింది. ఈ రీకాల్‌ ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన లేఖ రాశారు. కేంద్రం దానికి అంగీకరించకపోవడం, పొడిగింపు లేకుండానే సీఎస్‌ ఉద్యోగ విరమణ చేయడం, ఆ వెంటనే మమత ఆయనను తమ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం.. చకచకా జరిగిపోయాయి. సీఎస్‌ను డిప్యుటేషన్‌ మీద పంపించేది లేదంటూ ప్రధాని మోదీకి మమత తేల్చి చెప్పడంతో.. కేంద్రానికి, పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

ఆలాపన్‌ సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని మమత కేంద్ర ప్రభుత్వాన్ని మే 17న అభ్యర్థించారు. దీనికి మే 25న కేంద్రం సానుకూలంగా స్పందించి, కొనసాగింపునకు అనుమతించింది. ఆ తర్వాత బెంగాల్‌లో మోదీ పర్యటన, యస్‌ తుపానుపై సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బెంగాల్‌పై ఆగ్రహించిన కేంద్రం.. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. బంధోపాధ్యాయ్‌ సేవల్ని కేంద్రంలో ఉపయోగించుకోదలచినట్టు సమాచారం పంపింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన దిల్లీకి వచ్చి రిపోర్ట్‌ చేయాలనీ, ఆయనను రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రిమైండర్‌ను పంపింది. కానీ బంధోపాధ్యాయ మాత్రం దిల్లీకి వెళ్లి రిపోర్టు చేయలేదు.

బంధోపాధ్యాయ్‌ విషయంలో కేంద్రం ఇప్పుడు ఏం చేస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. షోకాజ్‌ నోటీసుకు వచ్చే వివరణ ఆధారంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదుపరి చర్యల్ని నిర్ణయిస్తుంది. పూర్తిస్థాయి పింఛన్‌ను మంజూరు చేసే విషయాన్ని ఈ అంశం తేలిన తర్వాతే నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తే.. అఖిల భారత అధికారుల క్రమశిక్షణ నిబంధనలు-1969 కింద ఏదో ఒక చర్య తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని