
తాజా వార్తలు
ట్రంప్ బ్లాక్ చేస్తే.. బైడెన్ ‘ఫాలో’ అయ్యారు!
వాషింగ్టన్: అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌కు.. అధ్యక్ష అధికార ఖాతా @POTUS నియంత్రణను అప్పగించింది ట్విటర్. ప్రస్తుతం ఈ అకౌంట్ నుంచే ట్వీట్లు చేస్తున్న బైడెన్.. కేవలం 12 మందిని ట్విటర్లో ఫాలో అవుతున్నారు. వీరిలో ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్ యెంహాఫ్, ఇతర వైట్‌హౌస్ సిబ్బందితో పాటు ఓ సెలబ్రెటీ ఉన్నారు. మరి ఆ ఒక్క సెలబ్రెటీని బైడెన్ ఎందుకు ఫాలో అవుతున్నారు..?
ప్రముఖ మోడల్, టెలివిజన్ స్టార్, రచయిత క్రిస్సీ టైగెన్ను బైడెన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో అనుసరిస్తున్నారు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందట. ట్విటర్లో ఎంతో చురుగ్గా ఉండే క్రిస్సీ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై గతంలో పలు మార్లు విమర్శలు చేశారు. ఇందుకు ఆయన కూడా తీవ్రంగానే స్పందించారు. ఆమె ‘రోత భార్య’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. పోటస్ అకౌంట్లో క్రిస్సీని బ్లాక్ చేశారు.
అయితే ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడంతో క్రిస్సీ నిన్న ఓ ట్వీట్ చేశారు. ‘‘పోటస్ ట్విటర్లో నన్ను నాలుగేళ్ల పాటు బ్లాక్ చేశారు. ప్లీజ్ మీరు నన్ను ఫాలో అవగలరా?’’ అని బైడెన్‌ను ఆమె అభ్యర్థించారు. ఇందుకు బైడెన్ అంగీకరించినట్లున్నారు. ప్రస్తుతం పోటస్ ఖాతాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క సెలబ్రెటీ ఈమే కావడం విశేషం. తన అభ్యర్థనను అధ్యక్షుడు బైడెన్ ఒప్పుకోవడంతో క్రిస్సీ ఆనందంతో సంబరపడ్డారు. ‘ఓ మై గాడ్. ఇక నేను అధ్యక్షుడి ట్వీట్లు చూడొచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్.. తొలి రోజే 15 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. వీటిలో చాలా వరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాలకు పూర్తి భిన్నంగా ఉన్నవే. మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ చేపట్టిన గోడ నిర్మాణంతో సహా.. ముస్లిం దేశాల పర్యాటకులపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికాను తిరిగి చేర్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ట్విటర్లోనూ ట్రంప్ బ్లాక్ చేసిన క్రిస్సీని బైడెన్ ఫాలో అవుతుండటం గమనార్హం.
ఇవీ చదవండి..
బైడెన్.. హారిస్ తొలి ట్వీట్లు ఇవే..
కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకాలు