Gopal Mandal: ఆ ఎమ్మెల్యే తాగేసి ఉన్నారు.. నా ఉంగరం లాక్కొన్నారు..!

తాజా వార్తలు

Updated : 04/09/2021 17:50 IST

Gopal Mandal: ఆ ఎమ్మెల్యే తాగేసి ఉన్నారు.. నా ఉంగరం లాక్కొన్నారు..!

దిల్లీ: రైలు ప్రయాణంలో లోదుస్తుల్లో సంచరించి వివాదంలోకెక్కిన బిహార్‌ అధికార జేడీయూ పార్టీ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌పై తాజాగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఘటన సమయంలో ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నారని, ఆయన ప్రవర్తనను నిలదీసినందుకు తన బంగారు ఆభరణాలను లాక్కొన్నారని తోటి ప్రయాణికుడు ఒకరు ఆరోపించారు. ఈ మేరకు దిల్లీలోని రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.

‘‘రైలు బోగీలో నిక్కరు, బనియన్‌తో అర్ధనగ్నంగా అటు ఇటూ తిరిగిన ఎమ్మెల్యే(గోపాల్‌ మండల్) ఆ సమయంలో తాగేసి ఉన్నారు. ఎందుకిలా ఉన్నారని అడిగినందుకు నా బంగారు ఉంగరం, చెయిన్‌ లాక్కొన్నారు. నాతో దురుసుగా ప్రవర్తించారు’’ అని సదరు ప్రయాణికుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రయాణికుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పట్నా-దిల్లీ తేజస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే గోపాల్‌ లోదుస్తుల్లో రైలు బోగీలో సంచరించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎమ్మెల్యే ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ తోటి ప్రయాణికులు ఆయనను నిలదీశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రైలులో ఒకింత ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు సర్దిచెప్పి ఎమ్మెల్యేను మరో బోగీలోకి పంపించారు. అయితే రైలు ఎక్కగానే పొట్టలో ఇబ్బందిగా అనిపించడంతో వాష్‌రూమ్‌కు వెళ్లే తొందరలో కుర్తా, పైజామా తొలగించానని, ఆ సమయంలో బోగీలో మహిళా ప్రయాణికులెవరూ లేరని ఎమ్మెల్యే  ఆ తర్వాత మీడియాతో చెప్పారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని