భర్త కోసం నీళ్లడిగితే.. కొంగుపట్టి లాగాడు!
close

తాజా వార్తలు

Updated : 11/05/2021 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త కోసం నీళ్లడిగితే.. కొంగుపట్టి లాగాడు!

ఆస్పత్రిలో బిహార్‌ మహిళకు లైంగిక వేధింపులు

పట్నా: కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త ఓ వైపు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వయసుమీరిన తల్లి మరోవైపు. కళ్లముందే ఇద్దరు ప్రాణాలతో పోరాడుతుంటే వైద్యుల మీద భారం వేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆమెది. ఆ నిస్సహాయతనే తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. భర్త, తల్లి కళ్లెదుట ఆ మహిళ కొంగు పట్టి లాగడానికి ప్రయత్నించాడు. ఒకవేళ అరిచి గోల పెడితే తన వారిని ఏదైనా చేస్తారనుకుని భయపడి మిన్నకుండిపోయింది. మెరుగైన చికిత్స కోసం మరో రెండు ఆస్పత్రులకు వెళితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం తన భర్తను దూరం చేసిందంటూ విలపించింది బిహార్‌కు చెందిన ఓ మహిళ. తనకు ఎదురైన అనుభవాలను తాజాగా సోషల్‌మీడియా వేదికగా బయటపెట్టింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

బిహార్‌కు చెందిన మహిళ నోయిడా నుంచి మార్చి నెలలో హోలీని జరుపుకొనేందుకు భర్తతో కలిసి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 11న ఆమె భర్త, తల్లి కరోనా బారిన పడ్డారు. దీంతో బిహార్‌లోని భగల్‌పూర్‌ గ్లోకల్‌ ఆస్పత్రిలో వారిని చేర్పించారు. తీరా అక్కడి వెళ్లాక అక్కడి సిబ్బంది కనీసం మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేరని సదరు మహిళ ఆరోపించింది. భర్త మంచినీరు కావాలంటే కూడా ఎవరూ అందించలేదని పేర్కొంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న సహాయకుడిని సాయం అడిగితే తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘మంచి నీటి కోసం అక్కడే ఉన్న ఓ కాంపౌడర్‌ను సాయం అడిగి వచ్చి భర్తతో మాట్లాడుతున్న. ఇంతలో నా భర్త సైగ చేయడం కనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే నా వెనుక నిల్చున్న వ్యక్తి నా కొంగును లాగి నడుం తడమడం కనిపించింది. వెంటనే కొంగు సర్దుకున్నా. కానీ, అతడిని ఏమీ అనలేదు. ఒకవేళ నేను అరిస్తే నా వారిని ఏమైనా చేస్తారని మిన్నకుండిపోయా’’ అంటూ చెప్పుకుంటూ సదరు మహిళ విలపించింది.

ఫోన్లో సినిమాలు చూసుకుంటున్నారు..

‘‘అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అదే ప్రాంతంలోని మాయగంజ్‌ ఆస్పత్రికి నా భర్తను తీసుకెళ్లాను. ఓ వైపు బాధితుల ప్రాణాలు పోతుంటే అక్కడ వైద్యులు, నర్సులు మొబైల్‌లో సినిమాలు చూసుకుంటున్నారు. భర్త ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో పట్నాలోని రాజేశ్వర్‌ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ను బ్లాక్‌లో ఒక్కోటి రూ.50వేలకు విక్రయించారు. అక్కడ నా భర్తకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేశారు’’ అని ఆమె తెలిపింది. కేవలం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయారని ఆరోపించింది. తనకెదురైన అనుభవం ఇంకెవరికీ ఎదురుకాకూడదని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సదరు మహిళ చేసిన ఆరోపణలపై స్థానిక అధికారులు గ్లోకల్‌ ఆస్పత్రిని వెళ్లారు. అప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తాము తొలగించామని, ఓ కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అయినా, మహిళ ఆరోపణలకు తగిన ఆధారాలేవీ లేవని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని