Lakshadweep: అయిషాకు భాజపా నేతల మద్దతు!
close

తాజా వార్తలు

Published : 12/06/2021 14:10 IST

Lakshadweep: అయిషాకు భాజపా నేతల మద్దతు!

ఆమెపై కేసును వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా

లక్షద్వీప్‌: కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో నటి అయిషా సుల్తానాపై నమోదు చేసిన దేశద్రోహం కేసు భాజపాలో విభేదాలకు తెరతీసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ 12 మంది భాజపా నేతలు, కార్యకర్తలు లక్షద్వీప్‌ భాజపా శాఖ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ హాజీకి రాజీనామా లేఖలను పంపారు. అయిషాపై అబ్దుల్‌ ఖాదరే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

‘‘లక్షద్వీప్‌లో పరిపాలనాధికారి ప్రఫుల్‌ కె.పటేల్‌ ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం ఇక్కడి భాజపా శ్రేణులకు తెలిసిందే. ఆయన వల్ల ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిసిన విషయమే. దీనిపై గతంలో మనమంతా హోంమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు కూడా చేశాం. ఇదే తరహాలో అయిషా సైతం తన అభిప్రాయాన్ని మీడియాలో వ్యక్తం చేశారు. మీరు(అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రఫుల్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కరోనా కేసులు ఎలా విజృంభించాయో ఆమె మీడియాతో మాట్లాడుతూ వివరించింది. మీరు ఆమెపై సమర్థించుకోలేని, తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సోదరి భవిష్యత్తుకు, కుటుంబానికి ఇబ్బందులు కలగజేస్తున్నారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం’’ అని అబ్దుల్‌ ఖాదర్‌ హాజీకి రాసిన లేఖలో నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు.

పరిపాలనాధికారి ప్రఫుల్‌ కె.పటేల్‌పై తీవ్ర విమర్శలు చేసినందుకు నటి అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిషా.. లక్షద్వీప్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ప్రఫుల్‌ నిర్ణయాలే కారణమని నిందించారు. ఈ క్రమంలో ఆయనను ఓ జీవాయుధంగా అభివర్ణించారు. దీనిపై అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని