
తాజా వార్తలు
టీకా వేయించుకున్న తొలి పొలిటీషియన్లు వీరే..!
దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ని నిరోధించడమే చేయడమే లక్ష్యంగా తొలి దశ టీకా పంపిణీకి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కరోనాపై పోరాటంలో ముందుండి పనిచేసిన వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందికి తొలి టీకాను పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తొలి రోజు ఇద్దరు రాజకీయ నాయకులు కూడా టీకాలు వేయించుకోవడం గమనార్హం. భాజపా ఎంపీ మహేశ్ శర్మ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ దేశంలోనే తొలి టీకా వేయించుకున్న రాజకీయ నేతలుగా నిలిచారు.
యూపీలోని గౌతమబుద్ధ నగర్‌కు చెందిన భాజపా ఎంపీ డాక్టర్ మహేశ్ శర్మ గతంలో వైద్యుడిగా శిక్షణ పొందారు. ఈ క్రమంలోనే ఆయన నోయిడాలోని సెక్టర్ 27లో ఉదయం 11గంటలకు టీకా అందుకున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ పనిచేసిన 61 ఏళ్ల మహేశ్ శర్మను ఆస్పత్రిలో 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచారు. టీకా వేయించుకున్న సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. కొవిడ్ అంతానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఒక వైద్యుడిగా తానూ కరోనా టీకా తీసుకున్నట్టు చెప్పారు. బాగానే ఉన్నానని తెలిపారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, అందరూ వేయించుకోవాలని విజ్ఞప్తిచేశారు.
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ నేత, కట్వా నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ కూడా టీకా వేయించుకున్నారు. రోగుల సంక్షేమ కమిటీలో భాగంగా ఆయన ఈ టీకా వేయించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా టీకా సరఫరాకు మించిన డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత ఎవరికి ప్రాధాన్యం ఇస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. తొలి దశలో కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ యోధులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇటీవల సీఎంలతో టీకా పంపిణీ ప్రక్రియపై జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాదు, తొలి విడతలో ప్రజాప్రతినిధులు ఉండబోరని, వారి వంతు వచ్చేంతవరకు వేచి ఉండాలని సూచించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు!