
తాజా వార్తలు
బ్రిటన్‌లో కొత్తరకం: ఆ ఒక్కడి కోసం గాలింపు!
అధికారుల ముందుకు రావాలని విజ్ఞప్తి
లండన్: కొత్తరకం కరోనాతో వణికిపోతోన్న బ్రిటన్‌లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే లాక్‌డౌన్‌పై సడలింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న సమయంలోనే తాజాగా మరో సవాల్ ఎదురయ్యింది. ప్రమాదకరంగా భావిస్తోన్న బ్రెజిల్ రకం కరోనా సోకిన వ్యక్తి ఆచూకీ అందుబాటులో లేదని తేలడంతో ఒక్కసారిగా కంగుతింది. దీంతో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం.. అతను ఎక్కడ ఉన్నా అధికారుల ముందుకు రావాలని బహిరంగ విజ్ఞప్తి చేసింది.
కరోనా వైరస్ విజృంభణతో సతమతమవుతోన్న బ్రిటన్‌లో ఇప్పటివరకు బ్రెజిల్ రకం కేసులు ఆరుగురిలో బయటపడ్డాయి. స్కాట్‌ల్యాండ్‌లో మూడు, సౌత్‌వెస్ట్ ఇంగ్లాండ్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోకేసుకు సంబంధించిన వ్యక్తిని మాత్రం కనుక్కోలేకపోయారు. కొవిడ్ టెస్టు చేయించుకున్న తర్వాత సదరు వ్యక్తి వ్యక్తిగత వివరాలను నమోదు చేయకుండానే వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే తేరుకున్న బ్రిటన్ ప్రభుత్వం, ఆ వ్యక్తి ఆచూకీని తెలుసుకోవడంలో నిమగ్నమయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిపిన టెస్టుల ఫలితం రాని వ్యక్తులు ముందుకు రావాలని వ్యాక్సిన్స్ మంత్రి నధీమ్ జవారీ విజ్ఞప్తి చేశారు. ఆ వ్యక్తిని కనుగొనేందుకు కొవిడ్ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తీవ్రంగా విశ్లేషిస్తున్నామని మంత్రి నధీమ్ జవారీ మీడియాతో పేర్కొన్నారు.
బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ కంటే బ్రెజిల్ రకం మరింత ప్రమాదకరమైందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం అత్యంత వేగంగా వ్యాప్తిచెందడమే కాకుండా యాంటీబాడీలను క్షీణింపచేయడంలో బ్రెజిల్ రకం వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నిపుణులు ప్రొఫెసర్ డానీ ఆల్ట్ మ్యాన్ పేర్కొన్నారు. బ్రెజిల్ రకం వైరస్ ఇక్కడ వ్యాపించడం కాస్త అప్రమత్తం కావాల్సిన విషయమే అయినప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ అమెరికా, బ్రెజిల్ నుంచి వచ్చే విమానాలపైనా బ్రిటన్ నిషేధం విధించింది. ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి తగ్గడంతో ఆంక్షల సడలించేందుకు ప్రయత్నిస్తోన్న తరుణంలోనే ఈ కొత్తరకం కేసులు బయటపడటం బ్రిటన్ను కలవరపడుతోంది.