Mamata Banerjee: బెంగాల్‌ సీఎంకు హైకోర్టు జరిమానా

తాజా వార్తలు

Published : 30/06/2021 16:22 IST

Mamata Banerjee: బెంగాల్‌ సీఎంకు హైకోర్టు జరిమానా

అఫిడవిట్‌ దాఖలుకు దీదీకి న్యాయస్థానం అనుమతి

దిల్లీ: నారదా కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరుపై సమాధానం ఇచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఇచ్చిన సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయనుందుకుగానూ దీదీ, బెంగాల్‌ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది. 

నారదా కుంభకోణానికి సంబంధించి ఇద్దరు మంత్రులు సహా నలుగురు నాయకులను మే 17న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలయ్‌ ఘటక్‌ కేసు విచారణ జరుగుతున్న  కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. ఈ తీరుపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఈ కేసును కింది కోర్టు నుంచి హైకోర్టే స్వీకరించాలంటూ దావా వేసింది. దీంతో హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నాయకుల అరెస్టు జరిగిన రోజు తాము వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి, న్యాయమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 9న హైకోర్టుకు సమాధాన ప్రమాణ పత్రాలు సమర్పించగా.. న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. కోర్టు చెప్పిన సమయం కాకుండా తమకు నచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వాటిని స్వీకరించబోమని హైకోర్టు తెలిపింది. 

దీంతో హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ, న్యాయమంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనపై గతవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. మమతా బెనర్జీ, తదితరులు ఇచ్చిన సమాధానాన్ని కలకత్తా హైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వారి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా సమాధాన ప్రమాణ పత్రాలు దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ దీదీ గత సోమవారం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును అంగీకరించిన న్యాయస్థానం.. సరైన సమయంలో అఫిడవిట్లు ఇవ్వనందుకు గానూ దీదీ, బెంగాల్‌ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని