ప్రధానితో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ భేటీ

తాజా వార్తలు

Published : 26/04/2021 19:45 IST

ప్రధానితో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ భేటీ

కొవిడ్‌ సన్నద్ధతపై సమీక్ష

దిల్లీ: దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆర్మీ చేస్తోన్న సన్నద్ధతపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సమయంలో ఆర్మీ చేపడుతున్న చర్యలను జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రధానికి వివరించారు. ముఖ్యంగా రెండేళ్ల క్రితం రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సీడీఎస్‌ చీఫ్‌ ప్రధానికి తెలిపారు. వీరితో పాటు అంతకుముందు రిటైరైన వారి సేవలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలకు సంబంధించిన అన్ని స్థాయిల వైద్యులను కొవిడ్‌ సేవలకు వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. వీరికి అవసరమైన నర్సింగ్‌ స్టాఫ్‌ను నియమించుకుంటున్నామని జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రధానికి వివరించారు. వీటితో పాటు రక్షణశాఖకు చెందిన అన్ని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లను కొవిడ్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నామని జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రధానికి తెలిపారు. సాధ్యమైన చోట కొవిడ్‌ రోగులకు సేవలు అందించేందుకు ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమయంలో విదేశాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేయడంలో భారత వాయుసేన పాత్రను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని