చైనా, పాక్‌ ముప్పు: సైన్యం సిద్ధంగా ఉండాల్సిందే!

తాజా వార్తలు

Published : 04/03/2021 16:25 IST

చైనా, పాక్‌ ముప్పు: సైన్యం సిద్ధంగా ఉండాల్సిందే!

భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌

దిల్లీ: ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటుందని త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ‘భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు-అత్యవసర చర్యలు’ అనే అంశంపై సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజిమెంట్‌ (సీడీఎం) ఏర్పాటు చేసిన వెబినార్‌లో త్రివిధ దళాధిపతి ఈ విధంగా మాట్లాడారు.

మారిన యుద్ధ స్వభావానికి అనుగుణంగా..

భారత సైన్యం‌ ప్రస్తుతం తీవ్ర భద్రతా, సవాళ్లతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటోందని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా వ్యూహాలు, రక్షణశాఖ వ్యూహాత్మక మార్గదర్శకాలు, రక్షణశాఖలో నిర్మాణాత్మక సంస్కరణలను మరోసారి నిర్వచించుకోవాలని స్పష్టంచేశారు. 20వ శతాబ్దంలో సమాచార విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయిందని త్రివిధ దళాధిపతి అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కొత్త సాధనాలు, వ్యూహాలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఇలాంటి సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని జనరల్‌ బిపిన్‌ రావత్‌ గుర్తుచేశారు.

చైనా, పాక్‌లతో ముప్పే..

‘భవిష్యత్తులో భారత్‌ చుట్టుపక్కల, హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఉత్పన్నమయ్యే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ సీడీఎస్‌ చీఫ్ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారత సైన్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. యుద్ధం స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సీడీఎస్‌ చీఫ్‌ నొక్కిచెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని