గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌
close

తాజా వార్తలు

Updated : 02/01/2021 21:02 IST

గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. దేశీయంగా భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సిఫార్సు చేసిన మరుసటి రోజే కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌ చేసుకున్న దరఖాస్తును పరిశీలించేందుకు శనివారం మరోసారి సమావేశమైన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొవాగ్జిన్‌కు సంబంధించి రెండు దశల ప్రయోగాలు పూర్తవగా.. మూడో దశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రెండు దశల ప్రయోగాల్లోనూ ఈ టీకా నుంచి ఆశాజనక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అత్యవసర వినియోగానికి నిపుణుల బృందం సిఫార్సు చేసింది. సీరం సంస్థకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కోసం మాత్రమే వినియోగించేందుకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేయగా.. భారత్‌ బయోటెక్‌కు ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలతో క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌లో అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అలాగే క్యాడిలా హెల్త్కేర్ లిమిటెడ్కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించడానికి అనుమతించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

తర్వాత ప్రక్రియ ఏంటి?: కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదించిన నిపుణుల బృందం ఈ సమావేశంలో చర్చించిన అంశాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు పంపుతుంది. వీటికి డీసీజీఐ ఆమోదముద్ర వేసి అనుమతుల పత్రాన్ని జారీచేస్తుంది. అనంతరం అనుమతి పొందిన సంస్థ.. మార్కెట్‌ ఆథరైజేషన్‌, ఉత్పత్తికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే మార్కెట్‌లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది.

అత్యవసర వినియోగ అనుమతి అంటే...?
రోగికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు మాత్రమే కొన్ని టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇస్తారు. ఆ వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకోవాలి. ఆ టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందే చెప్పాలి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో కోటి మంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, 50 ఏళ్లపైబడిన 27 కోట్ల మందికి తొలిదశలో టీకా అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టీకాను నేరుగా మార్కెట్‌లోకి తెస్తే నల్ల బజారుకు తరలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ సంస్థల ద్వారానే దీన్ని అందించాలన్న షరతు విధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి..

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని