పాక్‌ గెలిస్తే సంబరాలా..? దేశద్రోహం కేసు పెడతాం: యూపీ సీఎం హెచ్చరిక

తాజా వార్తలు

Published : 29/10/2021 02:25 IST

పాక్‌ గెలిస్తే సంబరాలా..? దేశద్రోహం కేసు పెడతాం: యూపీ సీఎం హెచ్చరిక

లఖ్‌నవూ: ఇటీవల టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్‌ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నవారిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాంటి వారిపై దేశద్రోహం కేసులు మోపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం గురువారం ఉదయం ట్వీట్‌ చేసింది. ఇటీవల మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ విజయంపై ఆగ్రాలోని రాజా బల్వంత్‌ సింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న ముగ్గురు కశ్మీర్‌ విద్యార్థులు సంబరాలు జరుపుకోగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మత ప్రాతిపదికన గ్రూపుల మధ్య వైరాన్ని, సైబర్‌ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వారిపై అభియోగాలు మోపారు. ఈ ముగ్గురూ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. 

ఆ నిందితులపై కోర్టు బయట దాడి..

కశ్మీర్‌కు చెందిన ముగ్గురు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు ఆగ్రా కోర్టులో హాజరు పరిచారు. అనంతరం వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను రక్షించే ప్రయత్నం చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. భారత్‌ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అరెస్టును ఖండించిన ముఫ్తీ..

ఈ అరెస్టులను పీడీపీ అధ్యక్షురాలు, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా కొందరు కశ్మీర్‌ నేతలు ఖండిస్తున్నారు. తమ రాష్ట్రంలో, బయట ప్రాంతాల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు, ఈ ముగ్గురు విద్యార్థులను కళాశాల సోమవారం సస్పెండ్‌ చేసింది. అయితే, ముఫ్తీది తాలిబన్‌ మనస్తత్వమని పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారికి జైలు తప్పదని కశ్మీర్‌ భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా విమర్శించారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌, పిప్పర్‌లో కొందరు పాక్‌ విజయంపై సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకోగా.. స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అబ్దుల్‌ రషీద్‌ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో కోర్టు అతడికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పాక్‌ జట్టు విజయాన్ని స్వాగతిస్తూ వాట్సాప్‌లో అభ్యంతరకర స్టేటస్‌ పెట్టిన ప్రైవేటు ఉపాధ్యాయురాలు నఫీషాను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తూ ఆమె వీడియో విడుదల చేయగా.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆమె పనిచేస్తున్న పాఠశాల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో పాక్‌ విజయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు ఓ వైపు వినిపిస్తుండగా.. మరోవైపు ఆటలో ఒక జట్టుకు మద్దతు ప్రకటించంలో తప్పేంటి అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని