17 ఏళ్ల వారికీ టీకా.. కేంద్రం చెప్పిందన్న అసోం సీఎం

తాజా వార్తలు

Published : 25/10/2021 19:20 IST

17 ఏళ్ల వారికీ టీకా.. కేంద్రం చెప్పిందన్న అసోం సీఎం

గువాహటి: రాష్ట్రంలో 17 ఏళ్ల వయసున్న వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ అన్నారు. కేంద్రం ఆ మేరకు సూచనలు చేసిందని చెప్పారు. కాబట్టి 17 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకుంటేనే మహమ్మారి మరోసారి విజృంభించకుండా ఉంటుందన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రం నుంచి కొత్త ఆదేశాలు వచ్చాయి. 17 ఏళ్లు పైబడి వారు కూడా ఇకపై కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. కాబట్టి, 17, 18 ఏళ్లు మధ్య వయసున్న బాలబాలికలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోండి’’ అని హిమంత పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి టీకాలు 18 ఏళ్లు పైబడిన వారికే వేస్తున్నారు. 12-18 ఏళ్లు వారికి జైడస్‌ క్యాడిలా రూపొందించిన సూది అవసరం లేని జైకోవ్‌-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఉన్నాయి. అయితే  ఆ వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. చిన్నారులకు టీకా విషయంలో ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్లు వయసు వారూ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని హిమంత పేర్కొనడం గమనార్హం. 2020 నవంబర్‌ నుంచి 2021 ఫిబ్రవరి వరకు తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌.. మళ్లీ విజృంభించిన విషయాన్ని హిమంత గుర్తుచేశారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని