Covid vaccine: ఉచితంగా టీకా..అతి పెద్ద నిర్ణయం

తాజా వార్తలు

Published : 21/06/2021 16:34 IST

Covid vaccine: ఉచితంగా టీకా..అతి పెద్ద నిర్ణయం

18 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి పంపిణీ

దిల్లీ: దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడినవారికి సోమవారం నుంచి ఉచితంగా కరోనా టీకాలు వేయనున్నారు. దానిలో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు టీకాలు అందనున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. రాష్ట్రాలపై పైసా భారం పడదని తేల్చిచెప్పారు. ఈ నెల 21 నుంచి దాన్ని అమలు చేయనున్నట్లు ఆ సందర్భంగా వెల్లడించారు. అలాగే 18 ఏళ్లు పైబడిన వారు టీకా కేంద్రంలోనే కొవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఆన్‌లైన్‌లో ముందస్తు నమోదు తప్పనిసరి కాదని పేర్కొంది. జనవరి 16న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటి వరకు 28 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.  

ఉచితంగా టీకా.. అది పెద్ద నిర్ణయం..

జులై, ఆగస్టు నెలల్లో కొవిడ్-19 టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో టీకా కేంద్రాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దాదాపు ప్రతిఒక్కరికి టీకాలు వేసే లక్ష్యాన్ని మేం వేగంగా సాధిస్తాం. జులై, ఆగస్టులో టీకాల వేగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా మోదీ నాయకత్వంలో ఒక ముఖ్యమైన యుద్ధం ప్రారంభమైంది. 18ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కేంద్రం ఉచితంగా టీకాలు ఇచ్చేలా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అధిక జనాభా ఉన్న దేశంలో ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలనేది అతి పెద్ద నిర్ణయం’ అని షా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అర్హులకు ఉచితంగా టీకా అందిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే టీకా కార్యక్రమంలో భారత్‌ ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. 

టీకా విధానం గురించి మరికొంచెం..

• 18ఏళ్లు పైబడిన భారతీయ పౌరులంతా ప్రభుత్వ టీకా కేంద్రంలో ఉచితంగా కరోనా టీకాను పొందొచ్చు. అంతకుముందు ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పించింది. 

• మొత్తం టీకా ఉత్పత్తిలో 75 శాతం డోసులను కేంద్రం తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ఆ స్టాక్‌ను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుంది. దాంతో రాష్ట్రాలకు పైసా భారంపడదు. అంతకుముందు 50శాతం టీకాలను కేంద్రం కొనుగోలు చేయగా.. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు చెరో 25 శాతం చొప్పున పొందేవి. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు మిగిలిన 25 శాతం సేకరణను యథావిధిగా కొనసాగించవచ్చు. 

• జనాభా, కరోనా తీవ్రత, టీకా పంపిణీలో పురోగతి ఆధారంగా కేంద్రం రాష్ట్రాలకు టీకా డోసులను కేటాయిస్తుంది. 

• టీకా కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌లో ముందస్తు నమోదు తప్పనిసరి కాదు. 

• టీకా స్లాట్లను బుక్‌ చేసుకునే విషయంలో ప్రజలకు సహకరించేందుకు రాష్ట్రప్రభుత్వాలు సర్వీస్‌ సెంటర్లు, కాల్‌ సెంటర్లు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని