AgriLaws: రద్దు కాదు..సవరణలు చాలు!

తాజా వార్తలు

Published : 02/07/2021 21:50 IST

AgriLaws: రద్దు కాదు..సవరణలు చాలు!

స్వాగతించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం లేదని.. కేవలం వివాదాస్పద అంశాలను తొలగిస్తే సరిపోతుందని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవార్‌ ప్రకటనను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్వాగతించారు. రైతులకు అభ్యంతరమున్న అంశాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతు సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయకుండా.. వాటికి అవసరమైన సవరణలు చేస్తే సరిపోతుందని కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, శరద్‌పవార్‌తో ప్రభుత్వం ఏకీభవిస్తోందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే రైతు సంఘాల నాయకులతో 11సార్లు చర్చించామని గుర్తుచేశారు. మరిన్ని చర్చల ద్వారా ఈ సమస్య త్వరలోనే సమసిపోయి.. ఆందోళన చేస్తోన్న రైతులు వారి ఇళ్లకు చేరుకుంటారని తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక కొత్త వ్యవసాయ చట్టాలపై పలు రాష్ట్రాల రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. వీటికి వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గడిచిన ఆరు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రైతులకు మద్దతు పలికిన ఎన్‌సీపీ చీఫ్‌.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని గతంలో పేర్కొన్నారు. తాజాగా వీటిపై వెనక్కి తగ్గిన పవార్‌, రైతులు అభ్యంతరం తెలుపుతోన్న అంశాలను తొలగిస్తే సరిపోతుందని పేర్కొనడం గమనార్హం. ఇదిలాఉంటే, రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలనే పట్టుబడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని