చైనా.. యూకే.. మీడియా యుద్ధం

తాజా వార్తలు

Published : 12/02/2021 11:36 IST

చైనా.. యూకే.. మీడియా యుద్ధం

బీజింగ్‌: చైనా.. యూకేల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్‌ లైసెన్స్‌ను బ్రిటన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు డ్రాగన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన బీబీసీ వరల్డ్ న్యూస్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. తమ కవరేజీ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా టెలివిజన్‌ అండ్‌ రేడియో రెగ్యులేటర్‌(ఎన్‌ఆర్‌టీఏ) గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. 

ఉయిగర్‌ మైనార్టీలు, కరోనా మహమ్మారి విషయంలో బీబీసీ.. దేశ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసిందని, పక్షపాతంగా వ్యవహరించిందని డ్రాగన్‌ ఆరోపించింది. కవరేజీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ బీబీసీ వరల్డ్‌ న్యూస్‌ ప్రసారాలను చైనా భూభాగంలో కొనసాగించేందుకు అనుమతించట్లేదని ఎన్‌ఆర్‌టీఏ తమ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే బీబీసీపై చైనాలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఈ మీడియా ప్రసారాలను కొన్ని హోటళ్లు, వ్యాపార నివాస ప్రాంతాలు మినహా బహిరంగ ప్రదేశాల్లో చూడలేరు. 

కాగా.. వారం రోజుల క్రితం చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ లైసెన్స్‌ను యూకే రద్దు చేసింది. స్టార్‌ చైనా మీడియా లిమిటెడ్‌ నిబంధనలు విరుద్ధంగా సీజీటీఎన్‌ఎస్‌కు లైసెన్స్‌ తీసుకుందని తేలడంతో యూకే మీడియా నియంత్రణ సంస్థ ఆప్‌కాఫ్‌ గతవారం ఈ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే యూకే నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో ప్రకటించిన డ్రాగన్‌.. తాజాగా బీబీసీపై నిషేధం విధించడం గమనార్హం. 

చైనా నిర్ణయంపై బీబీసీ స్పందించింది.. ‘‘చైనా అధికారుల నిర్ణయం నిరాశకు గురిచేసింది. ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ. ప్రపంచం నలుమూలల నుంచి కథనాలు ఎలాంటి భయం లేకుండా పారదర్శకంగా ప్రసారం చేస్తాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటు బ్రిటిష్‌ విదేశీ వ్యవహారాల కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌ స్పందిస్తూ.. ‘‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని పేర్కొన్నారు. మరోవైపు చైనా నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా కూడా ఖండించింది. 

ఇటీవల హాంకాంగ్‌లో బీజింగ్‌ వివాదాస్పద భద్రతా చట్టాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో చైనా, యూకే మధ్య సంబంధాలు దిగజారాయి. ఈ ఏడాది జనవరిలో 5.4 మిలియన్ల హాంకాంగ్‌ వాసులకు యూకేలో జీవించే హక్కు కల్పించే దిశగా బ్రిటన్‌ ప్రభుత్వం ఓ వీసా విధానాన్ని తీసుకురావడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. 

ఇవీ చదవండి..

తుపాను ఎఫెక్ట్‌.. 130 వాహనాలు ఢీ

జిన్‌పింగ్‌కు కాల్‌ చేసిన బైడెన్‌
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని