గుడారాలు ఎత్తేసిన డ్రాగన్‌

తాజా వార్తలు

Updated : 16/02/2021 13:51 IST

గుడారాలు ఎత్తేసిన డ్రాగన్‌

* పాంగాంగ్‌ సరస్సులో జెట్టీ ధ్వంసం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

లద్దాఖ్‌‌లో చైనా సైన్యం మెల్లిగా వెనక్కి తగ్గుతోంది. గతవారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ దేశ దళాలు తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నాయి. ఫింగర్‌-8 అవతల వైపునకు వెళ్లే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడ ఏప్రిల్‌ 2020లో నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు. భారత్‌ కూడా ఇక్కడ బలగాల ఉపసంహరణను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకుంటోంది.

అతిపెద్ద నిర్మాణం తొలగింపు

ఈ క్రమంలో  తాజాగా ఫింగర్‌-5 వద్ద పాంగాంగ్‌ సరస్సులో నిర్మించిన జెట్టీని డ్రాగన్‌ సేనలు తొలగించాయి.  ఫింగర్‌ ప్రదేశాల్లో చైనా నిర్మించిన అతిపెద్ద నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి. సరస్సుల్లోని పడవలో బలగాలు దిగటానికి వీలుగా దీనిని నిర్మించింది. దీంతోపాటు సమీపంలోని హెలిప్యాడ్‌ను కూడా ధ్వంసం చేశాయి. వీటిని గత ఏప్రిల్‌ తర్వాత నిర్మించినట్లు భావిస్తున్నారు.  దీంతోపాటు ఫింగర్‌-4 వద్ద నిర్మించిన గుడారాలను కూడా తొలగిస్తున్నారు.  బెల్జియంకు చెందిన ఓ సైనిక విశ్లేషణ సంస్థ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈవిషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఇక్కడ చైనా స్పందిస్తున్న తీరును బట్టి భారత్‌ సరస్సు దక్షిణ ఒడ్డున కీలక శిఖరాలపై తన బలగాల ఉపసంహరణ కొనసాగిస్తోంది.  వాస్తవానికి భారత్‌కు ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడి నుంచి చూస్తే భారత్‌ మర పడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం చైనాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 190 వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఉపగ్రహాలు.. డ్రోన్ల నిఘా..

మరికొన్ని రోజుల్లో ఫింగర్‌ -3 వద్ద  భారత ఐటీబీపీకి  చెందిన ధాన్‌సింగ్‌ థాపా పోస్టు వద్దకు మన బలగాలు చేరుకోనున్నాయి. ఇప్పటికే సాయుధ వాహనాలను ఇరువర్గాలు వెనక్కి పిలిపించిన విషయం తెలిసిందే.  ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఫిబ్రవరి 20వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. ఈ క్రమంలో బలగాల ఉపసంహరణను మానవ రహిత విమానాలు, ఉపగ్రహాల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన  ప్రదేశాల్లో సైనిక ఉపసంహరణ కోసం జరిగే కోర్‌ కమాండర్ల మీటింగ్‌కు ముందు మరోసారి పాంగాంగ్‌ సరస్సు వద్ద పరిస్థితిపై రివ్యూ మీటింగ్‌ జరిగే అవకాశం ఉంది.

ఓ కన్నేసి ఉంచాల్సిందే..

భారత్‌ను 1962లో కూడా గల్వాన్‌ లోయలో చైనా  నమ్మించి మోసం చేసింది. చైనా అప్పట్లో కూడా గల్వాన్‌ లోయలోకి తమ దళాలను పంపింది. ఆ తర్వాత  భారత్‌ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుంచి వైదొలగింది. కానీ, 97 రోజుల తర్వాత హఠాత్తుగా భారత్‌పై దాడిని ప్రారంభించి అక్సాయ్‌చిన్‌ను దక్కించుకొంది. ఈ యుద్ధంలో 38,000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది. ఈ విషయాన్ని భారత్‌ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.  అంతేకాదు..  కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఈ  ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి మెల్లిగా ఫింగర్ 4 వరకూ వచ్చింది. అందుకే భారత దళాలు ఏమాత్రం ఏమరపాటుతో ఉండకూడదు. చైనాతో ఒప్పందం అంటే.. వెన్నుపోటును ఎదుర్కోవడానికి సిద్ధపడాలని ఈ చరిత్ర చెబుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని