China: డ్రాగన్‌ vs దీదీ గ్లోబల్‌

తాజా వార్తలు

Published : 06/07/2021 20:01 IST

China: డ్రాగన్‌ vs దీదీ గ్లోబల్‌

అప్లికేషన్‌ను తొలగించాలని సంస్థకు ఆదేశం

తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో  పేరొందిన సొంత సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సైతం చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఇప్పటికే అలీబాబా, టెన్సెంట్ సంస్థలపై చర్యలు తీసుకున్న డ్రాగన్.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలపై దీదీ గ్లోబల్‌పై కొరడా ఝుళిపిస్తోంది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో దీదీ గ్లోబల్ షేర్ల ట్రేడింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే చైనా సదరు సంస్థపై ఆంక్షలు విధిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజింగ్‌: తమ దేశానికి చెందిన మరో దిగ్గజ సంస్థపై చైనా కత్తిగట్టింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యత, ప్రచార ప్రయోజనాల పేరుతో క్యాబ్‌ సర్వీసులు అందించే ‘దీదీ గ్లోబల్‌ ఐఎన్‌సీ’పై ఆంక్షలు విధిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ రివ్యూ నేపథ్యంలో నూతన రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సహా చైనాకు చెందిన అప్లికేషన్‌ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని చైనా ప్రభుత్వం దీదీ గ్లోబల్‌కు తెలియజేసింది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సహా భద్రతా పరమైన సమస్యలను నిరోధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

14 దేశాల్లో కార్యకలాపాలు

ఉబెర్‌, ఓలా తరహాలో చైనాలో క్యాబ్‌ సర్వీసులు అందించే సంస్థే దీదీ గ్లోబల్‌ ఐఎన్‌సీ. ఈ రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఇదీ ఒకటి. దీదీ సంస్థకు 493 మిలియన్ల యాక్టివ్‌ యూజర్లు ఉండగా.. దీనిలో మూడొంతుల మంది చైనాలోనే ఉన్నారు. బీజింగ్‌ వేదికగా పనిచేసే ఈ క్యాబ్‌ సర్వీసు సంస్థ బ్రెజిల్‌, మెక్సికో సహా 14 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. గతంలో చైనాలో ఉబెర్‌, దీదీ మధ్య పోటీ నడిచింది. అయితే 2016లో దీదీ గ్లోబల్ చైనాలోని ఉబెర్‌ను కొనుగోలు చేసింది. దీదీ సంస్థ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 74.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తోందంటూ.. 

వ్యక్తిగత సమాచారాన్ని దీదీ అక్రమంగా సేకరిస్తోందని, డేటాను దుర్వినియోగం చేస్తోందని చైనా సైబర్‌ స్పేస్‌ సంస్థ ఆరోపిస్తోంది. డ్రాగన్‌ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సైతం వినియోగదారుల అభిరుచులు, ప్రవర్తనలపై దీదీ గ్లోబల్‌ భారీగా సమాచారం సేకరిస్తోందని.. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవచ్చని ఆరోపిస్తోంది. అయితే ఈ సంస్థపై చైనా ప్రభుత్వం దృష్టిసారించడం వెనకున్న కారణాలు స్పష్టంగా తెలియడంలేదు. వివిధ టెక్నాలజీ సంస్థల వినియోగదారుల డేటాను సేకరించడంపైనే అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చైనాలో సాంకేతిక దిగ్గజాల జోక్యం పెరగడం పట్ల చైనా కమ్యూనిస్టు పార్టీ పెద్దలు, నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బహుళజాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాల నిరోధక చట్టం కింద చైనా ప్రభుత్వం ఇటీవలే అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థకు 2.8 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. ఆర్థిక పరమైన విషయాలను దాచిపెట్టడం, యాంటీ కాపిటేటివ్‌ బిహేవియర్‌ ఆరోపణలపై మరికొన్ని సంస్థల మీద సైతం చర్యలు తీసుకొంది.

సమస్యల పరిష్కారానికి సిద్ధం

అప్లికేషన్‌ తొలగిస్తే చైనాలోని దీదీ గ్లోబల్‌ రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడనుంది. శుక్రవారం సైబర్‌ సెక్యూరిటీ సమీక్ష ప్రకటించిన వేళ దీదీ షేర్లు సుమారు 5.3 శాతం కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల గోప్యత, సమాచార రక్షణ సహా వినియోగదారులకు సురక్షితమైన సేవలందించే విషయంలో సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని దీదీ గ్లోబల్‌ వెల్లడించింది. అయితే న్యూయార్క్‌లో ఈ సంస్థ షేర్ల ట్రేడింగ్‌ మొదలైన కొద్దిరోజులకే డ్రాగన్‌ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్‌ 30న న్యూయార్క్‌లో ఐపీఓకు వెళ్లిన దీదీ గ్లోబల్‌ దాదాపు 4.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను సమీకరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని