
తాజా వార్తలు
బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు?
బీజింగ్: భారత్ నిర్వహించ తలపెట్టిన బ్రిక్స్-2021 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్ తర్వాత జరిగే ఈ సమావేశానికి సభ్య దేశాల అధినేతలు నేరుగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే, జిన్పింగ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నప్పటికీ ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. ఇరుదేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడు పర్యటిస్తారన్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రిక్స్-2021 సదస్సును భారత్ నిర్వహించే విషయంలో మద్దతు తెలుపుతున్నట్లు చైనా రెండు రోజుల క్రితం వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐదు సభ్యదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని పేర్కొంది. 2021 ఏడాదికి సంబంధించి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సు నిర్వహణ బాధ్యతలను చేపట్టిన భారత్, ఈ ఏడాది సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సదస్సు తేదీ మాత్రం ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఆతిథ్యమివ్వడానికి మద్దతు తెలుపుతున్నామని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.
భారత్-చైనా సరిహద్దుల్లో గతేడాది మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్వాన్ లోయ సమీపంలో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా వైపూ ప్రాణనష్టం జరిగినట్లు ఆ దేశం అంగీకరించింది. తాజాగా ఇరుదేశాలు ఒప్పందానికి రావడంతో సరిహద్దులో బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియ కొనసాగుతోంది.