జనాభా పెంపునకు చైనా గ్రీన్‌సిగ్నల్‌

తాజా వార్తలు

Updated : 31/05/2021 18:00 IST

జనాభా పెంపునకు చైనా గ్రీన్‌సిగ్నల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా వృద్ధిరేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆ దేశంలోని దంపతులు మూడో బిడ్డను కనేందుకు అనుమతులు ఇవ్వనుందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. వేగంగా జనాభా తగ్గిపోతే భవిష్యతులో అది చైనా ఆర్థిక అభివృద్ధిపై పెనుప్రభావం చూపిస్తుందని ఇప్పటికే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు షినువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ‘ప్రతి జంట మూడో సంతానం కనేందుకు అనుమతించారు. దీనికి తగినట్లు విధానాల్లో మార్పులు చేస్తారు’ అని ఆ వార్త సంస్థ పేర్కొంది. కాకపోతే ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఐదేళ్లలో అమలు చేయాల్సిన ప్రధాన నిర్ణయాలపై కూడా చర్చించారు. 

చైనా మెల్లగా దేశంలో జననాల రేటును పెంచుకుంటూ వస్తోంది. 1979లో తెచ్చిన ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ నిబంధనను కొన్ని దశాబ్దాలు కొనసాగించింది. 2016లో దీనిలో మార్పులు చేసి రెండో సంతానం కనేందుకు అనుమతులు ఇచ్చింది. అయినా  జననాల రేటులో  ఆశించిన స్థాయిలో పెరుగుదల కనిపించలేదు. 1962లో చైనాలో కరవు వచ్చిన సమయంలో ఏ స్థాయిలో జననాల రేటు ఉందో, 2020లో కూడా అదే స్థాయిలోనే ఉన్నట్లు ఆ దేశ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. గత పదేళ్లలో చైనా జనాభా వృద్ధిరేటు 0.53గా నమోదైంది. అంతకు ముందు పది సంవత్సరాల కన్నా ఇది తక్కువ. ప్రస్తుతం చైనా జనాభా దాదాపు 141 కోట్లు.

మరోపక్క చైనాలో రిటైర్మెంట్‌ వయస్సును కూడా పెంచే అవకాశం ఉంది. దీనిపై పొలిట్‌ బ్యూరో స్పందిస్తూ ‘మేము ముందు చూపుతో రిటైర్మెంట్‌ వయస్సు నిబంధనను విడతల వారీగా తొలగిస్తున్నాం’ అని తెలిపింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌ నేతృత్వం వహించారు. 

 చైనా మొన్నటి వరకు కఠినమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించింది. కానీ, జనాభాలో వ్యత్యాసం ఎక్కువ కావడంతో అప్రమత్తమైన ఆ దేశం పిల్లలు కనడంపై ఉన్న ఆంక్షలను సడలించింది. 2050 నాటికి చైనాలో దాదాపు సగం మంది 60ఏళ్ల పైబడిన వారే ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారే ప్రమాదం ఉందని పసిగట్టింది. ఇప్పటికే పెరిగిపోతున్న వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్ధమైంది. అయితే, వృద్ధుల సంరక్షణ సవాళ్లు మోసగాళ్లకు, కొన్ని పనికిమాలిన పోంజీ వంటి అవాంఛనీయమైన పెట్టుబడి పథకాలకు ద్వారాలు తెరిచినట్లు అయ్యిందని చైనా ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఈ తరహా మోసాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలుగు చూశాయని, ప్రస్తుతం ప్రభుత్వం వీటిపై దర్యాప్తు జరుపుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఇందులో భాగస్వామ్యమైన కంపెనీలను కూడా చైనా అధికారులు విచారిస్తున్నట్లు పేర్కొంది.

చైనాలో వయసు పైబడినవారి పర్యవేక్షణను సాధారణంగా వారి కుటుంబ సభ్యులే చూసుకుంటారు. అయితే, బతుకుదెరువు, ఉద్యోగాల కోసం భారీ స్థాయిలో ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతుండడంతో వృద్ధులు మాత్రం వారి ఇళ్లల్లో ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2016 నాటికే గ్రామీణ ప్రాంతాల్లో కోటి 60లక్షల మంది ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. ఇలా కుటుంబం, ఆర్థిక స్తోమత, పనిచేసేశక్తి.. ఈ మూడూ లేనివారి కోసం ప్రభుత్వమే సంరక్షణ బాధ్యత చూసుకునే ఏర్పాట్లు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని