Justice NV Ramana:  కోర్టుల్లో మౌలికసౌకర్యాలు మెరుగుపరచాలి.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తాజా వార్తలు

Updated : 23/10/2021 18:31 IST

Justice NV Ramana:  కోర్టుల్లో మౌలికసౌకర్యాలు మెరుగుపరచాలి.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమిపై సీజేఐ ఆందోళన

ముంబయి: ప్రజలకు సరైన న్యాయం అందించాలంటే అందుకు మెరుగైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని, సమర్థ న్యాయవ్యవస్థ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అయితే మన దేశంలో న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ, సరైన ప్రణాళిక లేకుండా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ కొత్త భవన సముదాయ ప్రారంభోత్సవానికి జస్టిస్‌ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ‘‘చట్టాలతో పాలించే ఏ సమాజానికైనా కోర్టులు అత్యంత కీలకమైనవి. అయితే మన దేశంలో చాలా కోర్టుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కఠినమైన వాస్తవం. కొన్ని కోర్టుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేవలం 5శాతం కోర్టుల్లోనే మెడికల్‌ ఎయిడ్‌ అందుబాటులో ఉంది. 26శాతం కోర్టు భవనాల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. 16శాతం కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. ప్రజలకు న్యాయం అందించాలంటే న్యాయపరమైన మౌలిక సదుపాయలు కూడా ముఖ్యమే. కానీ దేశంలో వీటి నిర్వహణ, పురోగతి ఏమాత్రం ప్రణాళిక లేకుండా జరుగుతుండటం కలవరపెడుతోంది’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘సాధారణంగా నేరగాళ్లు, బాధితులే కోర్టులకు వెళ్తారనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కొందరైతే తమ జీవితంలో కోర్టు బిల్డింగ్‌ చూడలేదని గొప్పగా చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజల్లో నెలకొన్న ఈ భావనను తొలగించాలి పౌరుల హక్కులను కాపాడాల్సిన సమయం వచ్చింది. సామాన్య పౌరుడు తన జీవితంలో ఎన్నో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటాడు. అయితే దాని కోసం కోర్టులకు వెళ్లేందుకు ఏమాత్రం సంకోచించకూడదు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కలిగివుండటం.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. 

కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదన పంపినట్లు జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వేదికపై ఉన్న న్యాయశాఖ మంత్రిని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని