Supreme court: ‘సుప్రీం’ జడ్జిలుగా తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లు సిఫారసు

తాజా వార్తలు

Updated : 18/08/2021 22:59 IST

Supreme court: ‘సుప్రీం’ జడ్జిలుగా తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లు సిఫారసు

దిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేల త్రివేది పేర్లు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ పేర్లను కేంద్రానికి ప్రతిపాదించారు. సీనియర్‌ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న తెలుగు న్యాయవాది పీఎస్‌ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది. బార్‌ అసోసియేషన్‌ నేరుగా జడ్జిగా అవకాశం దక్కించుకున్న తొమ్మిదో న్యాయవాదిగా నరసింహ నిలవనున్నారు.

మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని భవిష్యత్తులో ఓ మహిళ చేపట్టవచ్చని మాజీ సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. కర్ణాటక జడ్జి జస్టిస్‌ బీవీ నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్‌ బీవీ నాగరత్న తండ్రి జస్టిస్‌ వెంకటరామయ్య కూడా 1989 జూన్‌ నుంచి 1989 డిసెంబర్‌ వరకు సుప్రీంకోర్టు సీజేఐగా వ్యవహరించారు.

సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉండాలని ఎప్పట్నుంచో డిమాండ్లు వస్తున్నాయి. మాజీ సీజేఐ ఎస్‌ఏ బోబ్డే కూడా తన పదవీ విరమణకు ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహిళా సీజేఐని నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా న్యాయవ్యవస్థకు మహిళా నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. అన్నట్టుగానే తాజాగా జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించేందుకు సిఫారసు చేయడం విశేషం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని