విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి!

తాజా వార్తలు

Published : 25/02/2021 13:58 IST

విదర్భ కేంద్రంగా వైరస్‌ ఉద్ధృతి!

కట్టడి చేయకుంటే అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి..

పుణె: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన వైరస్‌ ఉద్ధృతి‌, క్రమంగా పుణె, ముంబయి వంటి ప్రాంతాలకు విస్తరిస్తోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీన్ని ఇక్కడే నియంత్రించకుంటే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించే ముప్పు ఉందని అక్కడి ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాలుగు నెలల అనంతరం మరోసారి ఉద్ధృతి..!

నాలుగు నెలల తర్వాత మహారాష్ట్రలో కరోనా రోజూవారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా విదర్భ కేంద్రంగా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని, నాగ్‌పూర్‌ నుంచి అమరావతి, ఔరంగాబాద్‌ వరకూ వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోందని కరోనాపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా ఉన్న డాక్టర్‌ సుభాష్‌ సాలుంకే స్పష్టంచేశారు. ఇది రెండో దఫా విజృంభణ అని చెప్పడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీన్ని ఇక్కడే నియంత్రించకుంటే దేశవ్యాపంగా విస్తరించే ముప్పు కచ్చితంగా ఉందని హెచ్చరించారు.

భిన్న కారణాలు..

వైరస్‌ విజృంభణకు భిన్న అంశాలు కారణమవుతున్నాయని మహారాష్ట్ర వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌లో కలిగే మార్పులు, వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోన్న వ్యక్తులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. వీటి కారణంగానే వైరస్‌ తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని.. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మొన్నటి వరకు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రస్తుతం మరోసారి పెరుగుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో పలు జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతికి మార్పు చెందిన‌ రకమా? అని ఐసీఎంఆర్‌ కూడా చెప్పలేకపోతోందని డాక్టర్ సుభాష్‌ సాలుంకే అభిప్రాయపడ్డారు. వీటిని తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నమూనాలను వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. వీటి విశ్లేషణ సమాచారం ఫిబ్రవరి చివరినాటికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

పలుచోట్ల తప్పని లాక్‌డౌన్‌..

వైరస్‌ ఉద్ధృతి పెరగుతోన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో చివరి ఆయుధంగా లాక్‌డౌన్ విధించాల్సి వస్తోందని మహారాష్ట్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసుకోవడం, స్థానికంగా ఆంక్షలు విధించడం, పర్యవేక్షణ పెంచడం, కొవిడ్‌ టెస్టింగ్‌-ట్రాకింగ్‌ను భారీగా పెంచడం వల్ల వైరస్‌ ఉద్ధృతిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అవకాశం వచ్చిన ప్రతిఒక్కరూ సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి కొవిడ్ విభాగం సాంకేతిక సలహాదారుగా ఉన్న డాక్టర్‌ సుభాష్‌ సాలుంకే స్పష్టంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని