Corona: కాంగ్రెస్‌ కీలక నేత రాజీవ్‌ సాతవ్‌ కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కాంగ్రెస్‌ కీలక నేత రాజీవ్‌ సాతవ్‌ కన్నుమూత

పుణె: కరోనా మహమ్మారి మరో ప్రముఖ నాయకుడి ప్రాణాల్ని కబళించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సన్నిహితుల్లో ఒకరిగా పేరుగాంచిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్(46) ఆదివారం ఉదయం క‌న్నుమూశారు. ఆయనకు ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఆయన‌ పుణెలోని జహంగీర్ ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. మే 9న నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినప్పటికీ.. కొవిడ్‌ సమయంలో తలెత్తిన అనారోగ్యం అలాగే కొనసాగడంతో సెకండరీ న్యుమోనియా వంటి సమస్యలు తలెత్తి అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ప‌నిచేసిన సాతవ్‌. ప్ర‌స్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

1974 సెప్టెంబర్‌ 21న పుణెలో జన్మించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. 2014-2019 మధ్య హింగోలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన సతావ్‌.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

సాతవ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ సహా పులువురు రాజకీయ నాయకుడు తీవ్ర  విచారం వ్యక్తం చేశారు. ‘‘పార్లమెంటులో నా సహచర మిత్రుడు రాజీవ్ సాతవ్ మరణవార్త నన్ను ఆవేదను గురి చేసింది. సాతవ్‌ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అత్యంత సామర్థ్యం గల నాయకుడు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్విటర్‌లో మోదీ విచారం వ్యక్తం చేశారు. 

రాజీవ్‌ సాతవ్‌ మరణం తనకు తీరని నష్టమని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. ‘‘నా స్నేహితుడు రాజీవ్ సాతవ్‌ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. కాంగ్రెస్ ఆదర్శాలతో మూర్తీభవించిన, గొప్ప సామర్థ్యం ఉన్న నాయకుడు. ఆయన మరణం మనందరికీ పెద్ద నష్టం. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని