సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

తాజా వార్తలు

Updated : 08/02/2021 15:16 IST

సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం

దిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ నేడు రాజ్యసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం మన లక్ష్యాలను నిర్దేశించిందని, ఆయన ప్రసంగం ఈ దశాబ్దానికి మార్గనిర్దేశనం అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌ గతంలో వ్యవసాయ సంస్కరణలపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ విపక్షాలకు చురకలంటించారు.

కనీస మద్దతు ధరలో మార్పుండదు..

‘‘దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయి. రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిన్న, సన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కిసాన్‌ క్రెడిట్‌, ఫసల్‌ బీమా తెచ్చాం. పంట బీమా యోజనను మరింత విస్తరిస్తాం. చిన్న, సన్నకారు రైతుల కోసం పింఛను పథకం ప్రవేశపెట్టాం. గ్రామ సడక్‌ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నాం. కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పుండదు అని చెబుతూనే ఉన్నాం. ఎంఎస్‌పీ ఉండేది.. ఉంది.. ఎప్పటికీ ఉంటుంది. అయినా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలియట్లేదు. కొత్త చట్టాల్లో అభ్యంతరాలేంటో చెప్పట్లేదు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సభ నుంచే రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నా. ఆందోళన విరమించండి. సమష్టిగా సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఆందోళనల్లో వృద్ధులు కూడా ఉండటం బాధగా ఉంది. వారిని ఇళ్లకు పంపించండి’’ అని మోదీ సూచించారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనపై అంతర్జాతీయ స్పందనలు, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాల గురించి కూడా మోదీ పరోక్షంగా స్పందించారు. నేడు నూతన విదేశీ విధ్వంసక సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయని, వాటి పట్ల దేశం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌జీ ఇక్కడే ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి నేను గుర్తుచేస్తాను. సాగు చట్టాలపై యూటర్న్‌(ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకున్నవారు.. నా మాట కాకపోయినా ఆయన మాటను అంగీకరిస్తారని ఆశిస్తున్నా.. రైతులకు స్వేచ్ఛాయుత మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని మన్మోహన్‌జీ చెబుతూ ఉండేవారు. మన్మోహన్‌జీ కోరుకున్నది.. మోదీ చేస్తున్నందుకు మీరు(కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ) గర్వపడాలి’’ - ప్రధాని మోదీ

కరోనాపై విజయం ప్రజలందరిది..

‘‘గతేడాది ప్రపంచమంతా కంటికి కనిపించని మహమ్మారిని ఎదుర్కొంది. కరోనా సంక్షోభాన్ని భారత్‌ సమర్థంగా ఎదిరిస్తోంది. కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచాం. వ్యాక్సిన్లను తయారుచేయడమే గాక, ఇరత దేశాలకు సాయం అందించేందుకు టీకాలను సరఫరా చేస్తున్నాం. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్‌లో నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనాపై పోరులో విజయం ప్రభుత్వానిది కాదు.. దేశ ప్రజలందరిది’’ అని మోదీ ప్రశంసించారు.

భారత్‌ బలం ప్రపంచానికి తెలిసింది..

‘‘భారత్‌ మరింత బలపడటానికి సంక్షోభం ఉపయోగపడింది. ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. నూతన అవకాశాలకు నిలయంగా మారింది. ప్రపంచ ఔషధ కేంద్రంగా అవతరించింది. దీంతో ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తోంది. మానవాళి రక్షణకు భారత్‌ చేసిన ప్రయత్నాలను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఉగ్రవాదంపై పోరాటం, టీకా.. ఇలా అనేక అంశాల్లో భారత్‌ బలం ప్రపంచానికి తెలిసింది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి..

ఆ 1178 ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేయండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని