Corona: కోటి కేసులు..90 వేల మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కోటి కేసులు..90 వేల మరణాలు!

ఒక్క నెలలో కరోనా తీవ్రత ఇదీ...
 తొలిదశతో పోల్చితే పదిరెట్ల వేగం
ప్రభుత్వ గణాంకాలను మించి  ప్రమాదకర వాతావరణం

ఈనాడు, దిల్లీ: సరిగ్గా 30 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కోటి కేసులు, 90 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి! తొలి ఉద్ధృతిలో ఇన్ని కేసులు రావడానికి 325 రోజులు, మరణాలు సంభవించడానికి 238 రోజులు పట్టాయి. ఇప్పుడు అంతకు పదిరెట్ల వేగంతో మహమ్మారి చుట్టుముడుతోంది! ఇప్పటివరకూ మొత్తం కేసుల్లో మరణాలు 1.09% కాగా, ఈనెలలో నమోదైనవి 0.88%గా ఉన్నాయి. రేటు పరంగా తక్కువే అయినా... వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆప్తులు, స్నేహితుల మరణవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలిదశలో కనిపించని భయానక పరిస్థితి ఇప్పుడు అంతటా అలుముకొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సగటున 20.06% పాజిటివిటీ రేటు నమోదవుతూ వస్తోంది. ఇంత భారీస్థాయిలో ప్రస్తుతం మరే దేశంలోనూ వైరస్‌ విస్తరించడం లేదు. ఏప్రిల్‌ ద్వితీయార్ధంతో పోల్చితే... మే తొలివారంలో 8.07% కేసులు, 49% మరణాలు పెరిగాయి. 

అదే కొంత ఊరట...

తాజాగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య 5,632 మేర పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈనెల 5-9 తేదీల మధ్య ఎన్నడూ లేనంతగా రోజుకు సగటున 4.02 లక్షల కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజులుగా ఈ సంఖ్య 3.50 లక్షలకు తగ్గడం, తొలి రెండు వారాల్లో పాజిటివిటీ రేటు 22.34% నుంచి 20.08కి పడిపోవడం కొంత సానుకూలంగా కనిపిస్తోంది.

దిల్లీలో ఫలితమిస్తున్న లాక్‌డౌన్‌

దేశ రాజధానిలో ఏప్రిల్‌ 19 నుంచి అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ సత్ఫలితాలిస్తోంది. కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. మార్చి 22 వరకూ వందల్లో ఉన్న కేసులు... ఆ తర్వాత వేలల్లోకి వెళ్లాయి. ఏప్రిల్‌ రెండో వారంలో కేసుల విస్ఫోటం మొదలవడంతో ఆప్‌ సర్కారు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దీంతో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శుక్రవారం కొత్తగా 8 వేల కేసులొచ్చాయి. ఏప్రిల్‌ 22న 36% ఉన్న పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 12 శాతానికి పరిమితమైంది. మే 3న 448కి చేరిన మరణాలు ఇప్పుడు 300కి దిగొచ్చాయి. 

పెరుగుతున్న రికవరీ...

ఈనెల 3 నుంచి రికవరీ పెరుగుతోంది. నాలుగు రోజుల నుంచి కేసుల గ్రాఫ్‌ సరళంగా మారుతూ వస్తోంది. మూడు రోజుల పాజిటివిటీ రేటు 20% కంటే తక్కువ నమోదైంది. 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరో 16 చోట్ల మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది.
* 187 జిల్లాల్లో రెండు వారాలుగా కేసులు తగ్గుముఖం పట్టగా, 316 జిల్లాల్లో నిరంతరం పెరుగుతున్నాయి. వీటిలోని తొలి 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి ఉంది! కంటైన్‌మెంట్‌ చర్యల వల్ల జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. గత రెండు వారాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, ఝార్ఖండ్, లద్దాఖ్, దాద్రానగర్‌ హవేలీ, అండమాన్‌లో వృద్ధిరేటు తిరోగమనంలో సాగుతోంది. మిగతా అన్ని రాష్ట్రాల పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
* తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర, మణిపుర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరంలో గత రెండువారాల్లో వృద్ధిరేటు 50% నుంచి 230% దాకా నమోదైంది. ప్రస్తుత పరిస్థితులు చీకట్లో మిణుగురుల్లా కనిపిస్తున్నా... పూర్తిగా వెలుగు ప్రసరించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని