భారత్‌, చైనా.. పదోసారి భేటీ

తాజా వార్తలు

Published : 20/02/2021 13:09 IST

భారత్‌, చైనా.. పదోసారి భేటీ

దిల్లీ: భారత్‌, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు శనివారం మరోసారి సమావేశమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మోల్దోలో సీనియర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌ తరఫున లేహ్‌లోని 14వ కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌, చైనా తరఫున దక్షిణ షింగ్‌యాంగ్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లియు లిన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

కాగా.. సరిహద్దు వివాద పరిష్కారంపై రెండు దేశాల మధ్య ఇవి పదో విడత చర్చలు కావడం గమనార్హం. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు వద్ద  బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా.. హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, దేప్సాంగ్‌ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు ఆర్మీ వర్గాల సమాచారం.

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంతో భారత్‌, చైనా మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు గతవారం కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. వివాద పరిష్కారానికి ఇరు దేశాల నడుమ జరిగిన తొమ్మిదో రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఫలించి సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్‌, చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి పాంగాంగ్‌ సరిహద్దు వద్ద నుంచి రెండు దేశాలు బలగాలను వెనక్కి రప్పించాయి. ఆ ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది.

ఇదిలా ఉండగా.. గల్వాన్‌ లోయలో ఘర్షణకు సంబంధించి చైనా నిన్న ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలో తమ దేశానికి చెందిన నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంగీకరించిన డ్రాగన్‌.. గొడవకు కారణం భారత్‌ అంటూ మరోసారి దుష్ప్రచారానికి పాల్పడింది. చర్చలకు ఒక రోజు ముందు ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని