
తాజా వార్తలు
పెళ్లి పీటల పైనుంచి వచ్చి రక్తదానం!
లఖ్నవూ: పెళ్లి రోజు అనేది ఏ భార్యాభర్తలకైనా జీవితంలో మరపురానిది. అందుకే వివాహం గురించి పదిమంది చెప్పుకునేలా.. జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ జంట కూడా అలాంటి గుర్తుండిపోయే పనే చేసింది. కాకపోతే కేవలం వారి జీవితంలోనే కాదు.. ఓ చిన్నారికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పనిచేశారు ఆ నూతన వధూవరులు. పెళ్లి పందిరి నుంచి నేరుగా వెళ్లి ఓ చిన్నారికి రక్తం దానం చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
‘‘ఓ చిన్నారికి అత్యవసరంగా రక్తం కావాలి. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఓ జంట వారి వివాహం రోజునే ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశారు. ఆ చిన్నారి ప్రాణం కాపాడారు. నా దేశం చాలా గొప్పది.. జైహింద్’’ అంటూ ఆ కొత్త జంట ఫొటోను ట్విటర్లో జతచేశారు. పోలీస్ అధికారి ట్వీట్ చూసిన నెటిజన్లు ఆ కొత్త జంటను అభినందిస్తున్నారు. వారి వైవాహిక జీవితం బాగుండాలని ఆశీర్వదిస్తున్నారు.