COVAX: భారత్‌లో విలయం.. 19కోట్ల డోసుల కొరత!

తాజా వార్తలు

Published : 28/05/2021 20:15 IST

COVAX: భారత్‌లో విలయం.. 19కోట్ల డోసుల కొరత!

టీకాల కొరత తీర్చాలని ధనిక దేశాలకు ‘కొవాక్స్‌’ కూటమి పిలుపు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో చేస్తోన్న విలయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ చేసే ‘కొవాక్స్‌’ కార్యక్రమంపై తీవ్ర ప్రభావం పడినట్లు ‘కొవాక్స్‌ (COVAX) కూటమి’ పేర్కొంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులతో ‘కొవాక్స్‌’కు అందాల్సిన వ్యాక్సిన్‌లో తీవ్ర కొరత ఏర్పడినట్లు స్పష్టం చేసింది. జూన్‌ చివరి నాటికి 19కోట్ల వ్యాక్సిన్‌ డోసుల కొరత ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో టీకాలను నిల్వ చేసుకున్న దేశాలు ముందుకు రావాలని కొవాక్స్‌ కూటమిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, గావి, సెపీ సంస్థలు సంయుక్త ప్రకటన చేశాయి.

‘వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్న దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఆసుపత్రుల్లో చేరికలు తగ్గాయి. కరోనా విజృంభణకు ముందున్న పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌, యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్‌రైటా ఫోరే, CEPI సీఈఓ రిచార్డ్‌ హటెట్‌, GAVI సీఈఓ సేత్‌ బెర్ల్కీ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా 2021 నాటికి దాదాపు 200 కోట్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దక్షిణాసియాలో కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసే కార్యక్రమంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.

పరిష్కరించకపోతే మరో విపత్తు..

‘పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన కొవాక్స్‌ కార్యక్రమంలో ఇప్పటికే 126 దేశాల్లో 7 కోట్ల డోసులను పంపిణీ చేశాం. అయితే ఇవి ఆ దేశాల్లోని మొత్తం జనాభాలో 0.5 శాతం మందికి మాత్రమే సరిపోతాయి. ఇదే సమయంలో భారత్‌లో భయంకరంగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి కారణంగా జూన్‌ చివరి నాటికి 19కోట్ల డోసుల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఇదివరకే వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలతో వచ్చే ఏడాది నాటికి భారీగా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మరో విపత్తుకు కారణమవుతుంది’ అని కొవాక్స్‌ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలాంటి సమయంలో తక్షణమే వ్యాక్సిన్‌ను అందించాలని ధనిక దేశాలకు కొవాక్స్‌ కూటమి పిలుపునిచ్చింది. అంతేకాకుండా 18కోట్ల డోసులను ఇచ్చేందుకు అమెరికా, యూరప్‌ చేసిన వాగ్దానాలను కొవాక్స్‌ గుర్తుచేసింది. వాటిని జూన్‌ కన్నా ముందే  అందించాలని.. ఇలా 2021 నాటికి కనీసం వంద కోట్ల డోసులను సమకూర్చాలని సంపన్న దేశాలకు కొవాక్స్‌ కూటమి మరోసారి పిలుపునిచ్చింది.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ కీలకం

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవాక్స్‌కు టీకాలను అందించడంలో కీలక సరఫరాదారుగా ఉంది. COVAX కార్యక్రమంలో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ దాదాపు 64దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు అంగీకరించింది. కానీ ఊహించని రీతిలో భారత్‌లో విరుచుకుపడిన సెకండ్‌వేవ్‌తో కొవాక్స్‌కు అందించాల్సిన వ్యాక్సిన్లను సరఫరా చేయలేకపోతోంది. ముఖ్యంగా భారత్‌లో టీకాల కొరత వేధిస్తుండడంతో వ్యాక్సిన్‌ సరఫరాలో భారత్‌కే ప్రాధాన్యం ఇస్తామని ఆ సంస్థ సీఈఓ ఈ మధ్యే వెల్లడించారు.

ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొవిడ్‌ మహమ్మారికి 35లక్షల మంది బలయ్యారు. ఇదే సమయంలో పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 176 దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. 170కోట్ల డోసులను పంపిణీ చేశారు. అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, భారత్‌తో పాటు చైనాలోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా సాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని