Covaxin: డెల్టా, బీటా రకాలపై కొవాగ్జిన్‌ భేష్‌

తాజా వార్తలు

Updated : 09/06/2021 13:02 IST

Covaxin: డెల్టా, బీటా రకాలపై కొవాగ్జిన్‌ భేష్‌

ముంబయి: భారత్‌లో రెండో దశ తీవ్ర ఉద్ధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పుణెకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా ఇటీవల అధ్యయనం చేపట్టాయి. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ ఈ టీకా సమర్థంగా ఎదుర్కంటోందని అధ్యయనంలో తేలింది. 

కొవిడ్‌ నుంచి కోలుకున్న 20 మంది, కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 17 మంది నుంచి రక్తనమూనాలను సేకరించి తటస్థీకరణ సామర్థ్యాన్ని అంచనా వేశారు. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వీరిలో డెల్టా, బీటా వైరస్‌లను తటస్థీకరించే సామర్థ్యం ఎక్కువ ఉందని, ఈ రకాల నుంచి కొవాగ్జిన్‌ ఎక్కువ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయన నివేదికను బయోరిక్సివ్‌ ప్రీప్రింట్‌ సర్వర్‌లో పోస్ట్ చేయగా.. దీన్ని ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ, భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక శాస్త్రవేత్త ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.  

డెల్టా వేరియంట్‌(బి.1.617.2) వైరస్‌ రకాన్ని తొలుత భారత్‌లో గుర్తించగా.. బీటా వేరియంట్‌(బి.1.351) మొట్టమొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. భారత్‌లో రెండో దశ ఉద్ధృతికి డెల్టా రకమే కారణమని, ఇతర రకాలతో పోలిస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే డెల్టా రకం వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్లు ఆధారాలేమీ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కొవిడ్‌ వైరస్‌పై కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్‌ టీకా కూడా సమర్థంగా పనిచేస్తున్నాయని మరో అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే. వైరస్‌కు వ్యతిరేకంగా మంచి రోగనిరోధకతను అవి ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించింది.  అధ్యయన నివేదిక ప్రకారం.. రెండో డోసు పూర్తయ్యాక కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండూ మంచి రోగ నిరోధక సామర్థ్యాన్ని చేకూర్చాయి. కొవాగ్జిన్‌తో పోలిస్తే కొవిషీల్డ్‌ గ్రహీతల్లో యాంటీబాడీ స్థాయులు ఎక్కువగా కనిపించాయి. రెండో డోసు పూర్తయ్యాక 95% మందిలో సీరోపాజిటివిటీ (యాంటీబాడీల ఉత్పత్తి) కనిపించింది. కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో 98.1%గా, కొవాగ్జిన్‌ వేసుకున్నవారిలో 80%గా అది నమోదైంది. 60 ఏళ్లు పైబడినవారితో పోలిస్తే.. అంతకంటే తక్కువ వయసున్నవారిలో సీరోపాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని