Covaxin: 30రోజుల్లో 30 నగరాలకు సరఫరా!

తాజా వార్తలు

Published : 25/05/2021 15:01 IST

Covaxin: 30రోజుల్లో 30 నగరాలకు సరఫరా!

భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతున్న వేళ.. ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు తయారీ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ టీకాను గడిచిన 30 రోజుల్లో 30 నగరాలకు సరఫరా చేశామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దేశంలో చేపడుతున్న వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు సంస్థ సిబ్బంది కట్టుబడి ఉన్నారని.. ఇందుకోసం లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ 24x7 కృషిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. సిబ్బందిలో కొంతమంది వైరస్‌ బారినపడగా మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారని.. వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పేర్కొన్నారు.

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సిన్‌ కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్‌-వీ అనుమతి పొందినప్పటికీ డిమాండుకు సరిపడా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో విదేశీ వ్యాక్సిన్‌ల కోసం పలు రాష్ట్రాలు నేరుగా గ్లోబట్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. అయితే, ఫైజర్‌, మోడెర్నా వంటి సంస్థలు మాత్రం నేరుగా కేంద్ర ప్రభుత్వానికే సరఫరా చేస్తామని చెబుతుండడం మరింత ఇబ్బందిగా మారింది.

ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం గుజరాత్‌లోనూ నూతనంగా ఓ ప్లాంటును రూపొందిస్తామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. తద్వారా ఏడాదికి 20కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదిలాఉంటే, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌) కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటికి అవసరమైన పత్రాలను భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించింది. జూన్‌లో ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశం జరుగనుండగా.. వచ్చే మూడు నెలల్లో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని అంచనా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని